మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ **‘మన శంకర వర ప్రసాద్ గారు’**పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తోనే సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది.
టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో తన మార్క్‌ను బలంగా నిలబెట్టుకున్నాడు. గత సంక్రాంతికి వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు అదే జోరుతో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా ‘మీసాల పిల్ల’ సాంగ్ సుమారు 100 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన వెంకటేష్ – చిరంజీవి మాస్ సాంగ్ కూడా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా ప్రెస్ మీట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ అనుకోకుండా ఒక కీలక విషయం చెప్పేశారు. సినిమా క్లైమాక్స్‌లో వెంకటేష్ పాత్ర ఉంటుందని, దాదాపు 25 నిమిషాల పాటు వెంకీ సందడి చేయబోతున్నారని అనిల్ వెల్లడించారు. అంతకుమించి చెబితే థ్రిల్ పోతుందని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక జనవరి 12న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విడుదల కానుంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.



