న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా క్యాబ్, ఆటో సర్వీసులకు సంబంధించి నగర పోలీసులు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు.
డిసెంబర్ 31 అర్థరాత్రి న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ వాసులు ఇప్పటికే ప్లాన్లు సిద్ధం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు రెస్టారెంట్లు, పబ్బులు, బార్లు, క్లబ్‌ల వైపు జనాలు భారీగా కదిలే అవకాశం ఉంది. ముఖ్యంగా మద్యం సేవించిన తర్వాత చాలా మంది క్యాబ్ లేదా ఆటోలను ఆశ్రయిస్తుంటారు.
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలు
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా, బుకింగ్‌లో చూపిన ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లపై మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 178(3)(b) ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఫిర్యాదులకు వాట్సప్ నెంబర్
ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
ఫిర్యాదు చేసే సమయంలో
- వాహనం నంబర్
- రైడ్ జరిగిన సమయం, ప్రదేశం
- రైడ్ వివరాల స్క్రీన్‌షాట్
ఈ వివరాలను హైదరాబాద్ పోలీస్ అధికారిక వాట్సప్ నంబర్ 9490616555 కు పంపాలని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి నిబంధనలు అతిక్రమించిన డ్రైవర్లపై చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
న్యూ ఇయర్ రద్దీపై ముందస్తు జాగ్రత్తలు
డిసెంబర్ 31న రద్దీ కారణంగా ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాగే రైడ్ క్యాన్సిలేషన్లు కూడా ఎక్కువగా జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకే హైదరాబాద్ పోలీసులు ఈ కొత్త గైడ్‌లైన్స్ అమల్లోకి తీసుకొచ్చారు.



