ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఉన్న 26 జిల్లాల స్థానంలో ఇక నుంచి 28 జిల్లాలు పనిచేయనున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన పోలవరం, మార్కాపురం జిల్లాల్లో పాలన ప్రారంభానికి ప్రభుత్వం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోలవరం జిల్లా కలెక్టర్గా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే మార్కాపురం జిల్లా కలెక్టర్గా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పోలవరం జిల్లా ఎస్పీగా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించగా, మార్కాపురం జిల్లా ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు అదనపు బాధ్యతలు కల్పించారు.
పోలవరం జాయింట్ కలెక్టర్గా అల్లూరి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వగా, మార్కాపురం జాయింట్ కలెక్టర్గా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణను నియమించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో కలెక్టర్, జేసీ, ఎస్పీ కార్యాలయాలను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్త జిల్లాలకు శాశ్వత అధికారుల నియామకం జరిగే వరకు ఉమ్మడి జిల్లా అధికారులు ఇన్చార్జులుగా కొనసాగనున్నారు.
ఇక డిసెంబర్ 31 నుంచి అన్నమయ్య జిల్లా కార్యకలాపాలు మదనపల్లె కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు రాయచోటి నుంచి పనిచేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారుల కార్యాలయాలు ఇకపై మదనపల్లె నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.
నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు
- అడ్డరోడ్డు జంక్షన్ – అనకాపల్లి జిల్లా
- అద్దంకి – ప్రకాశం జిల్లా
- పీలేరు – అన్నమయ్య జిల్లా
- మడకశిర – శ్రీసత్యసాయి జిల్లా
- బనగానపల్లి – నంద్యాల జిల్లా
అలాగే రంపచోడవరం, చింతూరు డివిజన్లు పోలవరం జిల్లాలోకి విలీనం అయ్యాయి. అల్లూరి జిల్లాలో 11 మండలాలు, ఒక డివిజన్ ఉండగా, కడప జిల్లాలోకి రాజంపేట డివిజన్ చేరింది. తిరుపతి జిల్లాలోకి రైల్వేకోడూరు, రాయచోటి డివిజన్లో 6 మండలాలు చేరాయి. మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లగా, సామర్లకోట పెద్దాపురం డివిజన్లోకి చేరనున్నాయి.



