మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వివిధ కారణాలతో మద్యం సేవిస్తుంటారు. ఒక్కొక్కరి అభిరుచికి తగ్గట్టు మద్యం తాగే పద్ధతులు కూడా మారుతుంటాయి. కొంతమంది వేర్వేరు ఆల్కహాల్‌లను కలిపి తాగుతారు. మరికొందరు నీరు, సోడా, జ్యూస్‌లు, కొబ్బరి నీరు వంటి వాటితో మద్యం మిక్స్ చేసుకుని తాగుతుంటారు. అయితే కొందరిలో కనిపించే మరో అలవాటు పాలు తాగి మద్యం సేవించడం లేదా మద్యం తాగే ముందు పాలు తాగడం.
అయితే పాలు, మద్యం కలిపి తాగితే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకుంటే చాలా మంది ఈ అలవాటుకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
పాలు తాగిన వెంటనే మద్యం సేవిస్తే
పాలు తాగిన వెంటనే మద్యం లేదా బీరు తాగితే కొంతమందిలో ఎలాంటి సమస్యలు కనిపించకపోవచ్చు. కానీ చాలా మందికి జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పాలు, ఆల్కహాల్ కలయిక వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్, వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా లాక్టోస్ అసహనం ఉన్నవారికి ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఆల్కహాల్ శోషణపై ప్రభావం
పాలు తాగితే ఆల్కహాల్ శరీరంలోకి శోషించుకునే ప్రక్రియ కొంత నెమ్మదిస్తుందని కొందరు భావిస్తారు. కానీ ఇది పూర్తిగా సురక్షితమైన విషయం కాదు. పాలు, మద్యం కలిసి కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు మంట, అసౌకర్యం పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రమాదం
ఇప్పటికే జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ సమస్యలు, షుగర్, బీపీ వంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు పాలు, మద్యం కలిపి తాగడం మరింత ప్రమాదకరం. ఇది సమస్యలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఈ అలవాటు పూర్తిగా నివారించటం మంచిది.
ఎంత గ్యాప్ ఉంచాలి?
పాలు తాగిన వెంటనే కాకుండా కొన్ని గంటల తర్వాత మద్యం తాగితే శరీరంపై ప్రతికూల ప్రభావాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినా కూడా పాలు–మద్యం మధ్య సరైన విరామం ఉంచడం చాలా అవసరం. ఒకవేళ మద్యం తాగాలనుకుంటే తక్కువ ఆల్కహాల్ శాతం ఉన్న పానీయాలను మాత్రమే పరిమితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్బోనేటెడ్ డ్రింక్స్‌తో మద్యం కలపడం మరింత హానికరమని గుర్తుంచుకోవాలి.
ముఖ్య గమనిక
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ కథనం మద్యం సేవించడాన్ని ప్రోత్సహించడానికి కాదు. శరీరంపై వచ్చే ప్రభావాలపై అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం. ఏదైనా అలవాటు లేదా ప్రయోగం చేసే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.



