14 టేక్‌లు చేయించాడు.. దర్శకుడిపై సీరియస్ అయిన ప్రకాష్ రాజ్

సినీ రంగంలో బహుముఖ ప్రతిభ ఉన్న నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించి, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేశారు. బెంగళూరులో జన్మించి పెరిగిన ప్రకాష్ రాజ్‌కు చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి పెరిగిందని ఆయన పలుమార్లు వెల్లడించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రకాష్ రాజ్.. తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, విజయాల వెనుక ఉన్న కారణాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్‌కు పునాది వేసింది దర్శకుడు బాలచందర్ అని, ఆ తర్వాత మణిరత్నం లాంటి దర్శకులు తనలోని నటుడిని గుర్తించారని చెప్పారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత తనకు అవకాశాలు ఎలా కలిసి వచ్చాయో వివరించారు.

ఒక దశలో రఘువరన్ వంటి నటుడు అందుబాటులో లేకపోవడంతో, మంచి నటుల కోసం దర్శకులు వెతుకుతున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఆ సమయంలో పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, గుణశేఖర్, వి.వి. వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులకు తాను దొరకడం తన అదృష్టమని చెప్పారు. కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన అంతఃపురం, ఖడ్గం, సముద్రం సినిమాలు, అలాగే త్రివిక్రమ్ రచనలు తన కెరీర్‌ను కొత్త మలుపు తిప్పాయని గుర్తుచేసుకున్నారు.

తన సినీ జీవిత ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడారు. కర్ణాటకలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ జీవితం సాగించిన రోజులను గుర్తు చేసుకున్నారు. 1994లో డ్యూయెట్ సినిమాతో తమిళ పరిశ్రమలో అడుగుపెట్టిన అదే ఏడాది తన వివాహం కూడా జరిగిందని తెలిపారు. ప్రతి పాత్రకు తాను ఎలా సిద్ధమవుతానో కూడా వివరించారు.

అంతఃపురం సినిమాలో వృద్ధుడి పాత్ర కోసం పెద్ద అడుగులు వేస్తూ నడవమని దర్శకుడు కృష్ణవంశీ చెప్పిన విషయాన్ని ప్రకాష్ రాజ్ గుర్తుచేశారు. రాయలసీమ ప్రజలు సహజంగా అలా నడుస్తారని, అది పాత్రకు నిజత్వం ఇస్తుందని దర్శకుడు వివరించాడని చెప్పారు. అలాగే ఆ సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో తనను 14 టేక్‌లు చేయించారని తెలిపారు.

ఢిల్లీ రాజేశ్వరి పాత్ర గాజులు తీసే సన్నివేశంలో భావోద్వేగం సరిగ్గా రావడం లేదని దర్శకుడు మళ్లీ మళ్లీ టేక్‌లు తీసుకోవడంతో తనకు కోపం వచ్చిందని ప్రకాష్ రాజ్ చెప్పారు. “ఏం కావాలి నీకు?” అని తాను సీరియస్ అయ్యానని తెలిపారు. అప్పుడు కృష్ణవంశీ లైట్స్ ఆఫ్ చేయించి, ఎంత కఠినమైన మనిషైనా తన కూతురు వితంతువవుతున్న సమయంలో తండ్రికి కలిగే అసహాయతను, ఏడేళ్ల చిన్నపిల్లాడి ఏడుపు లాంటి భావంతో చూపించాలని చెప్పాడని వివరించారు.

దర్శకుడు ఇచ్చిన అలాంటి చిన్న సూచనలు తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లాయని, అదే తనకు జాతీయ అవార్డులు రావడానికి దోహదపడ్డాయని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి