సాధారణంగా మొదలైన చిన్న వివాదం చివరకు ఒకరి ప్రాణాలు తీసిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటి ముందు గేదెను కట్టేయవద్దన్న విషయంపై మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరి ఘాతుకానికి దారి తీసింది. ఈ ఘటనతో వేంసూర్ మండలం చౌడారం పరిధిలోని రాజుగూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఖమ్మం, డిసెంబర్ 30: ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం చౌడారం సమీపంలోని రాజుగూడెం గ్రామంలో గేదె కట్టే విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం ఒకరి మృతికి కారణమైంది. గ్రామానికి చెందిన మార్కపూడి వెంకట్రావు (50), బొల్లిపోగు వెంకటేశ్వరరావు మధ్య ఇంటి ముందు గేదెను కట్టడం విషయమై కొంతకాలంగా మాటామాటా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీయడంతో బొల్లిపోగు వెంకటేశ్వరరావు చేతిలో ఉన్న కర్రతో వెంకట్రావుపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. వెంకట్రావుకు గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో దాడి సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో అక్కడున్న వారు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకట్రావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బయటికి స్పష్టంగా కనిపించని అంతర్గత గాయాలు, గుండె సమస్యలు కలిసి మృతికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినప్పటికీ ప్రాథమిక సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ముత్తి లింగం తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.



