Senior Actress Sudha: అతను పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు.. సుధా భావోద్వేగ వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తల్లి, అక్క, భార్య, అత్త వంటి విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సీనియర్ నటి సుధా. కెరీర్‌లో 900లకు పైగా సినిమాల్లో నటించిన ఆమె, దాదాపు అన్ని స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అమ్మ పాత్రలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సుధా. ఇప్పటికీ విరామం లేకుండా సినిమాలు చేస్తూ చురుగ్గా కొనసాగుతున్నారు.

ఇటీవల సుధా గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో ఎదురైన వృత్తిపరమైన సవాళ్లు, అనుభవాలను ‘పాసింగ్ క్లౌడ్స్’గా భావిస్తూ, వాటిని జీవిత పాఠాలుగా తీసుకుని ముందుకు సాగుతున్నానని ఆమె తెలిపారు. ఇతరుల ఈర్ష్య వల్ల చివరికి నష్టపోయేది వారే అని సుధా అభిప్రాయపడ్డారు.

ఇండస్ట్రీలో తన స్నేహితుల గురించి మాట్లాడిన సుధా.. బెంగళూరు పద్మ, చంద్రమోహన్, జలంధర వంటి వారితో తనకు సన్నిహిత సంబంధం ఉందని చెప్పారు. పని చేసే ప్రదేశమే తనకు కుటుంబమని, తోటి కళాకారుల ఆరోగ్యం, శ్రేయస్సు గురించి ఎప్పుడూ ఆలోచిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. డబ్బు కంటే మనుషులను సంపాదించుకోవడమే నిజమైన సంపద అని అన్నారు. రక్త సంబంధాలే కాదు, కష్ట సమయంలో ఆదుకునే వారే నిజమైన బంధువులని ఆమె భావన.

ఇక దివంగత నటుడు ఉదయ్ కిరణ్ విషయంలో సుధా చేసిన వ్యాఖ్యలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. తల్లిని కోల్పోయి, తండ్రికి దూరమై, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఉదయ్ కిరణ్ ఒంటరితనం తనను తీవ్రంగా కలచివేసిందని సుధా చెప్పారు. అతడిని చూసినప్పుడు అనాథగా, సముద్రం మధ్యలో ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించిందని, దేవుడు తనకు ఇచ్చిన బిడ్డలా భావించానని తెలిపారు.

45 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత కూడా దత్తత తీసుకునే నిబంధనల ప్రకారం అన్ని న్యాయపరమైన పత్రాలు సిద్ధం చేసి, కోర్టు ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ తనను దూరం చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్, తన కుమార్తె ఫోన్, హెయిర్ స్టైలిస్ట్ ఫోన్‌లను కూడా ఎత్తడం మానేశాడని చెప్పారు. ఉదయ్ కిరణ్ పెళ్లి విషయం తనకు తెలియదని, ఆ వివాహానికి తాను హాజరు కాలేదని సుధా వెల్లడించారు. అతడికి ఆ పెళ్లి సరిపోలేదేమో అన్న భావన తనకు కలిగిందని అన్నారు.

ఉదయ్ కిరణ్ బ్రతికే ఉంటే తనకు బలమైన తోడు ఉండేదని, అతని అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సుధా కన్నీళ్లతో చెప్పారు. ఓ షూటింగ్ సమయంలో ఉదయ్ కిరణ్ తన కాళ్లపై పడి ఏడ్చిన సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఆ క్షణాన్ని జీవితాంతం మర్చిపోలేనని ఆమె భావోద్వేగంతో వెల్లడించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి