ఇప్పటి రోజుల్లో సమయం దొరికితే చాలు.. ఎక్కువ మంది ఆన్లైన్ షాపింగ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి నుంచే అవసరమైన ప్రతి వస్తువును మొబైల్లో ఆర్డర్ చేసేస్తున్నారు. అయితే ఇలా తరచూ ఆర్డర్లు పెడుతున్నప్పుడు ఖర్చు కూడా అనుకోకుండా పెరిగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో డబ్బు ఆదా కావాలంటే తప్పకుండా ఈ చిన్న ట్రిక్ తెలుసుకోవాలి.
క్విక్ కామర్స్ అంటే ఇదే
భారత మార్కెట్లో ఇప్పుడు క్విక్ కామర్స్ హవా కొనసాగుతోంది. Zepto, Blinkit, Big Basket, Instamart వంటి యాప్స్ నిమిషాల్లోనే సరుకులు ఇంటి ముందు పెట్టేస్తున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ సేవలకు విపరీతమైన ఆదరణ ఉంది. ఒక్కో ఇంట్లో రోజుకు నాలుగు నుంచి ఐదు ఆర్డర్లు కూడా సాధారణమే. సౌకర్యం పెరిగినా, ఖర్చు మాత్రం గట్టిగానే పెరుగుతోంది.
MRPలు చూసి కొనడం ముఖ్యం
పాలు, కూరగాయలు, పండ్లు, తక్షణం కావాల్సిన సరుకులకు క్విక్ కామర్స్ యాప్స్ ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు వీటిలో ఎలక్ట్రానిక్స్, చిన్న హోమ్ అప్లయన్సెస్, దుస్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలామంది ధరలు పోల్చుకోకుండా ఆర్డర్ చేస్తుండటంతో అదనంగా డబ్బు ఖర్చవుతోంది.
ఈ-కామర్స్ vs క్విక్ కామర్స్
క్విక్ కామర్స్ యాప్స్‌లో సాధారణంగా భారీ డిస్కౌంట్లు ఉండవు. పైగా ప్యాకింగ్ చార్జీలు, హ్యాండ్లింగ్ ఫీజులు, సర్వీస్ ఛార్జీల పేరుతో మొత్తం ధర 30 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అదే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి. చాలా సందర్భాల్లో అదనపు చార్జీలు లేకుండానే డెలివరీ కూడా వస్తుంది.
ఇప్పుడు ఈ-కామర్స్ యాప్స్ కూడా ఫాస్ట్ డెలివరీ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. కొన్ని వస్తువులు అదే రోజు లేదా కొన్ని గంటల్లోనే డెలివరీ అవుతున్నాయి. కాబట్టి అత్యవసరమైన వస్తువులు తప్ప మిగతా అన్నింటికీ ఒకసారి ఈ-కామర్స్‌లో ధరలు పోల్చి చూడటం మంచిది.
ఇలా చేస్తే 40 శాతం సేవ్
చిన్న ధర ఉన్న పాలు, పెరుగు, కూరగాయలు లాంటి వాటిలో పది, పదిహేను రూపాయల తేడా పెద్దగా కనిపించదు. కానీ ఖరీదైన వస్తువుల్లో మాత్రం వందల రూపాయల తేడా స్పష్టంగా ఉంటుంది. అందుకే తక్షణ అవసరాలకు క్విక్ కామర్స్, ముందుగా ప్లాన్ చేసుకునే కొనుగోళ్లకు ఈ-కామర్స్‌ను ఉపయోగిస్తే దాదాపు 40 శాతం వరకు డబ్బు ఆదా చేయవచ్చు. ఇది నిజమైన స్మార్ట్ షాపింగ్ స్టైల్.



