చుట్టూ దట్టమైన అడవి… పక్కనే కదలికలేకుండా పడి ఉన్న తల్లిదండ్రులు… చిమ్మచీకట్లో ఎటు వెళ్లాలో తెలియక, ఎందుకు లేవడం లేదో అర్థం కాక ఐదేళ్ల బాలుడు భయంతో వణికిపోయాడు. ఎవరిని పిలవాలి? ఏం చేయాలి? తెలియని స్థితిలో తండ్రి మృతదేహం పక్కనే రాత్రంతా కూర్చుని జాగారం చేశాడు. తండ్రి మరణించాడని, తల్లి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని అతనికి తెలియదు.
తెల్లవారాక దారి వెతుక్కుంటూ రోడ్డుపైకి వచ్చిన బాలుడిని గమనించిన బాటసారులు ఆరా తీయగా, అడవిలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశా రాష్ట్రం డియోగఢ్ జిల్లా కుందేయిగోల అటవీ ప్రాంతంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే…
డియోగఢ్ జిల్లా జియాంతపాలి గ్రామానికి చెందిన దుష్మంత్ మాఝీ, రింకీ మాఝీ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. శనివారం రింకీ పుట్టింటికి వెళ్లిన వారు, సాయంత్రం తిరిగి వస్తుండగా భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరగడంతో కుందేయిగోల అటవీ ప్రాంతంలో దుష్మంత్ బైక్‌ను ఆపేశాడు.
తరువాత కొడుకుతో కలిసి భార్యాభర్తలు అడవిలోకి వెళ్లి, తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దుష్మంత్ అక్కడికక్కడే మృతి చెందగా, రింకీ స్పృహ కోల్పోయింది.
ఎంత పిలిచినా తల్లిదండ్రులు స్పందించకపోవడంతో వారు నిద్రపోతున్నారని భావించిన బాలుడు, భయంతో రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. ఉదయం దారి వెతుక్కుంటూ రోడ్డుపైకి రావడంతో బాటసారుల దృష్టికి వచ్చాడు. బాలుడిని వెంటబెట్టుకుని వారు అడవిలోకి వెళ్లగా ఈ దారుణం బయటపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అంబులెన్స్ ద్వారా దుష్మంత్, రింకీలను ఆసుపత్రికి తరలించారు. అయితే దుష్మంత్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా, రింకీ కూడా చికిత్స పొందుతూ మరణించింది. బాలుడికీ స్వల్పంగా పురుగుల మందు తాగించారని, అయితే మోతాదు తక్కువగా ఉండటంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.
ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడిని అతని తాత, అమ్మమ్మలకు అప్పగించారు.



