ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీ గేట్ కూడలి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. భారీ లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే వెళ్తున్న బొలెరో వాహనంపై బోల్తా కొట్టడంతో ఈ విషాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. నైనిటాల్ రోడ్డులోని పహాడీ గేట్ వద్ద, స్థానిక పవర్ హౌస్ సమీపంలో బిలాస్పూర్ వైపు వెళ్తున్న గడ్డి లోడ్ లారీ మలుపు వద్ద రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఎక్కింది. అదే సమయంలో పక్కనే వెళ్తున్న బొలెరో వాహనంపై లారీ అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ ఫిరాసత్ (54) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజర్‌టోలా గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
విద్యుత్ శాఖ వాహనం ధ్వంసం
ప్రమాదానికి గురైన బొలెరో విద్యుత్ శాఖకు చెందిన ఎస్డీఓ వాహనమని సమాచారం. అదే సమయంలో పక్కన వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు స్వల్ప తేడాతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే అతని బైక్‌కు నష్టం వాటిల్లింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సర్వీసెస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్రేన్ సాయంతో లారీతో పాటు బొలెరోను తొలగించి రహదారిని క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద స్థలాన్ని ఎస్పీ విద్యా సాగర్ సందర్శించి పరిశీలించారు. భారీ లోడ్‌తో ప్రయాణించడం, మలుపు వద్ద వాహన నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అధికారులు తాజాగా విడుదల చేశారు. ఫుటేజీలో జంక్షన్ వద్ద బొలెరో మలుపు తీసుకుంటున్న సమయంలో ఎదురుగా వస్తున్న లోడ్ లారీ డివైడర్‌ను ఎక్కి నేరుగా బొలెరోపై పడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. క్షణాల్లో బొలెరో నుజ్జునుజ్జు అయిన ఈ వీడియో నెటిజన్లను కలచివేస్తూ వైరల్‌గా మారింది.



