చోడవరం కలకలం: జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతు బలి, వైసీపీ నేతల అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో వైసీపీ నేతలు చేసిన చర్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ముందు మేకపోతును బలి ఇచ్చి, రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేయడం రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లోనూ తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అంతేకాదు, ఫ్లెక్సీపై “రప్పారప్పా” వంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాసి, వాటి వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా భయభ్రాంతులు సృష్టించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం చోడవరం గ్రామానికి చేరుకున్న పోలీసులు, ఘటనకు బాధ్యులైన ఏడుగురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి అశాంతి కలిగించే చర్యలు చట్ట విరుద్ధమని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రచారం పేరుతో జంతువులను బలి ఇవ్వడం, వాటి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సహించబోమని హెచ్చరించారు. రాజకీయ ఉత్సాహంలో ఇలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిదైనా సరే శిక్ష తప్పదని ఎస్పీ స్పష్టంగా తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి