మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలతో జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపారు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత ధర్మాన సోదరులదేనని స్పష్టం చేస్తూ శనివారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.
దివ్వెల మాధురితో కలిసి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న దువ్వాడ శ్రీనివాస్, ఎస్పీని నేరుగా కలుసుకుని తన ఫిర్యాదును అందజేశారు. ఇటీవల తనకు వరుసగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, వాటి కారణంగా తన భద్రతపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం, పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను బహిర్గతం చేయడమే తనపై కక్ష పెంచుకునేందుకు కారణమని ఆయన ఆరోపించారు.
గత కొన్ని రోజులుగా ధర్మాన సోదరులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న దువ్వాడ శ్రీనివాస్, తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను భౌతికంగా దాడి చేయాలనే ఉద్దేశంతో కొందరు ప్రణాళికలు రూపొందిస్తున్నారని, అందుకు వెనుక రాజకీయ శక్తులే ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆయన నేరుగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తనకు తక్షణమే తగిన పోలీసు రక్షణ కల్పించాలని, అలాగే తనను బెదిరిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ పోలీసులను కోరారు.



