అమరావతి బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా పర్యాటక శాఖ సరికొత్త సాంస్కృతిక ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. ‘ఆవకాయ’ అనే వినూత్న పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడను కేంద్రంగా చేసుకుని ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. “తెలుగు నేలపై పుట్టిన కథలు, కవితలు, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపై ఆవిష్కరించడమే ‘ఆవకాయ’ ఉత్సవ ప్రధాన లక్ష్యం. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రజలకు మరింత దగ్గర చేయడమే ఈ ప్రయత్నం” అని ఆయన తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ఫెస్టివల్‌ను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ప్రముఖ సాంస్కృతిక సంస్థ టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా ఈ వేడుకలు జరగనున్నాయి. సాధారణంగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇండోర్ హాళ్లకే పరిమితమవుతుంటాయని, అయితే ‘ఆవకాయ’ను తొలిసారిగా బహిరంగ ప్రదేశాల్లో, ప్రజల విస్తృత భాగస్వామ్యంతో నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తుందని మంత్రి దుర్గేశ్ వివరించారు. ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, సమకాలీన సృజనాత్మక ఆలోచనలకు కూడా వేదిక కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.



