జగన్ జన్మదిన వేడుకలు – తాడేపల్లి నివాసం వద్ద సంచలనంగా మారిన ఫ్లెక్సీ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ హడావిడి మొదలైంది. రేపు (ఆదివారం) డిసెంబర్ 21న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ఏపీతో పాటు తెలంగాణ, బెంగళూరు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలకు సిద్ధమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో జగన్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు రాష్ట్రవ్యాప్తంగా దర్శనమిస్తున్నాయి. పార్టీ ఆదేశాల మేరకు పలు సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక ఫ్లెక్సీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఫోటోలు ఉండటం విశేషంగా మారింది. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫ్లెక్సీ చూసిన వైసీపీ, బీఆర్ఎస్ (గులాబీ పార్టీ) శ్రేణులు సోషల్ మీడియాలో విస్తృతంగా స్పందిస్తున్నారు. ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారంటూ అనుకూల వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. గురువు–శిష్యులను ఓడించడం ఖాయమని కొందరు పోస్టులు చేస్తున్నారు.

ఇక ఈ పరిణామాల మధ్య, రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ–బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో జగన్‌కు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి మంచి ఆదరణ ఉండటంతో, ఆ ప్రాంతాల్లో గులాబీ పార్టీకి పోటీ కఠినంగా మారుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

గతంలో సర్పంచ్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైసీపీ మద్దతుతో బీఆర్ఎస్ పలుచోట్ల విజయం సాధించిందని నేతలు గుర్తు చేస్తున్నారు. అదే వ్యూహాన్ని భవిష్యత్‌లో, ముఖ్యంగా 2028 ఎన్నికల దృష్ట్యా అమలు చేయాలనే ఆలోచనలో జగన్–కేసీఆర్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ రాజకీయ సంకేతాలకే నిదర్శనంగా తాడేపల్లి నివాసం వద్ద ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారనే వాదనలు ఊపందుకుంటున్నాయి. రాజకీయంగా ఇది ఎటువంటి దిశగా దారి తీస్తుందన్నది వేచి చూడాల్సిందే.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి