మన శరీరంలోని అంతర్గత ఆరోగ్య స్థితిని తెలియజేసే ముఖ్యమైన సూచకాలలో నాలుక ఒకటి. అందుకే ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్యులు మొదటగా నాలుకను పరిశీలిస్తారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల నాలుక సాధారణంగా గులాబీ రంగులో, తేమగా ఉంటుంది. అయితే నాలుక రంగు మారితే అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ లోపాలు, ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత రుగ్మతలు వంటి అనేక సమస్యలు నాలుక రంగు మార్పుల రూపంలో బయటపడతాయి.
నాలుక రంగు ఏ వ్యాధికి సంకేతం?
తెల్లటి పూత ఉన్న నాలుక
నాలుకపై తెల్లటి పొర కనిపిస్తే అది నోటి పరిశుభ్రత లోపం లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను సూచిస్తుంది. మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, పిల్లలు మరియు వృద్ధుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడకం వల్ల కూడా తెల్లటి పూత ఏర్పడుతుంది.
ఎర్రటి నాలుక
నాలుక అసాధారణంగా ఎర్రగా ఉంటే శరీరంలో విటమిన్ బి-12 లోపం లేదా తీవ్రమైన జ్వరం ఉన్నట్లు అర్థం కావచ్చు. దీర్ఘకాలం ఇలా ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
పసుపు రంగు నాలుక
నాలుక పసుపు రంగులోకి మారితే కామెర్లు, మధుమేహం లేదా కాలేయ సమస్యలకు ప్రాథమిక సంకేతంగా భావిస్తారు. నోటి పరిశుభ్రత సరిగా లేకపోయినా ఈ సమస్య రావచ్చు.
ఊదా రంగు నాలుక
నాలుక ఊదా రంగులో కనిపిస్తే గుండె సంబంధిత సమస్యలు లేదా శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడం లేదని సూచించవచ్చు.
ముదురు లేదా నలుపు రంగు నాలుక
నాలుక ముదురు రంగులోకి మారితే బాక్టీరియా అధికంగా పెరగడం, పొగ త్రాగడం, మాదకద్రవ్యాల వినియోగం వంటి అలవాట్ల ప్రభావం ఉండొచ్చు.
గోధుమ రంగు నాలుక
నాలుక గోధుమ రంగులో కనిపిస్తే శరీరంలో ఐరన్ లోపం ఉన్నట్టు సూచించవచ్చు.
నారింజ రంగు నాలుక
నోరు పొడిబారడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల నాలుక నారింజ రంగులో కనిపించే అవకాశం ఉంది.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
నాలుక రంగులో మార్పులు కొన్నిసార్లు తాత్కాలికంగా ఉండొచ్చు. కానీ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
- నాలుక రంగు మార్పు రెండు వారాలకు మించి కొనసాగితే
- రంగు మార్పుతో పాటు జ్వరం, గొంతు నొప్పి లేదా కడుపు నొప్పి ఉంటే
- నాలుకపై నొప్పి, మచ్చలు లేదా మంట కనిపిస్తే
జీర్ణ సమస్యలు, అధిక ఒత్తిడి, కొన్ని రకాల క్యాన్సర్ల లక్షణాలు కూడా మొదటగా నాలుకపైనే కనిపించవచ్చు. అందుకే ప్రతిరోజూ పళ్లు తోముకునే సమయంలో నాలుకను కూడా శుభ్రం చేసుకోవడం మంచిది. ఏదైనా అసాధారణ మార్పు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.



