ఆంధ్రప్రదేశ్ లో PMSuryaghar సౌర యోజన: దళితులు, గిరిజనులకు ఉచితం, బీసీలకు రాయితీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ యోజన పథకాన్ని రాష్ట్రంలో మరింత విస్తృతంగా అమలు చేయనున్నట్లు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దళితులు, గిరిజనులకు సౌర విద్యుత్ రూఫ్‌టాప్ వ్యవస్థను పూర్తిగా ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే వెనుకబడిన వర్గాలకు (బీసీలు) ప్రత్యేక రాయితీలతో ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు.

దేశవ్యాప్తంగా కోటి మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉంటుంది.

ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలనుకునేవారికి ఈ పథకం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలతో ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.
ఉదాహరణకు—
3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు ఖర్చు సుమారు రూ.1.50 లక్షలు కాగా, ఇందులో రూ.78 వేల వరకు కేంద్ర రాయితీ లభిస్తుంది.
2 కిలోవాట్ల సోలార్ రూఫ్‌టాప్ కోసం రూ.60 వేల రాయితీ ఉంటుంది.
1 కిలోవాట్ సోలార్ యూనిట్ ఏర్పాటు చేస్తే రూ.30 వేల వరకు కేంద్రం భరిస్తుంది.

మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పథకం ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితం, బీసీలకు రాయితీతో అమలు కానుంది.

దరఖాస్తు విధానం ఇలా:

• ముందుగా pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి
• మీ కరెంట్ మీటర్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ నమోదు చేయాలి
• లాగిన్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి
• దరఖాస్తు సమర్పించిన అనంతరం అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారు
• వెబ్‌సైట్‌లో సూచించిన ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీల ద్వారా సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్ చేయించాలి
• ఇన్‌స్టాలేషన్ పూర్తైన తర్వాత వివరాలను మళ్లీ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలి
• కొత్త మీటర్ ఏర్పాటు చేసి, డిస్కం అధికారులు పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తారు
• చివరిగా బ్యాంక్ వివరాలు అప్‌డేట్ చేస్తే, సుమారు నెల రోజుల్లో రాయితీ మొత్తం నేరుగా అకౌంట్‌లో జమ అవుతుంది

ఈ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, మీకు సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయంలో వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి