రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరొకసారి ఆందోళన కలిగించింది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అర్ధరాత్రి దాటిన తర్వాత చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మందికి పైగా యాత్రికులు విషాద మరణం పొందినట్లు ప్రాథమిక సమాచారం. మరికొందరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు, గాయపడినవారంతా చిత్తూరు జిల్లాకు చెందినవారేనని గుర్తించారు. వారి పూర్తి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులు ఏపీ 39 యూఎం 6543 నంబర్ ఉన్న ప్రైవేట్ బస్సులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల దర్శనానికి బయల్దేరారు. గురువారం రాత్రి భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరానికి వెళ్తుండగా విపత్తు సంభవించింది. చింతూరు–మారేడుమిల్లి మార్గంలో ఉన్న తీవ్రమైన మలుపు వద్ద బస్సు అకస్మాత్తుగా అదుపు కోల్పోయి సుమారు 50 అడుగుల లోతైన లోయలో కుప్పకూలింది.
ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడిపోవడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు యాత్రికులు బస్సు కింద నలిగిపోయారు. కొంతమంది కిటికీల గుండా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. చలి, చీకటి మధ్య జరిగిన ఈ ఘటన యాత్రికులకు నిజంగా నరకానుభూతిని కలిగించింది.
ఘాట్ రోడ్డులో రాకపోకలు కొనసాగించిన వాహనదారులు ఈ దుర్ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం చేరవేయడం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీగా వాహనాల రద్దీ పెరగడంతో ఘాట్ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.



