ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త: హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక కమిటీ ఏర్పాటు

ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం మరోసారి శుభవార్తను అందించింది. గత ఏడాదిన్నరగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో జరిగిన పూర్వ చర్చల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నేటితో ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది.

ఉద్యోగ సంఘాలు గత సమావేశంలో ఆరోగ్య పథకం, హెల్త్ కార్డులు, నెట్‌వర్క్ ఆస్పత్రుల సమస్యలు, పెండింగ్ బిల్లులు, సాంకేతిక లోపాలు వంటి అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు. సమస్యలను పరిశీలించి సమగ్ర పరిష్కారాలు సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారమే నేడు హెల్త్ కార్డుల సమస్యలపై ప్రత్యేక అఫీషియల్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అక్టోబర్ 18న సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటు అంశం నిర్ణయించబడగా, నేడు ఆ నిర్ణయానికి అధికారిక రూపం లభించింది. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీ సీఎస్ విజయానంద్ ఆధ్వర్యంలో పని చేయనుంది. వచ్చే ఎనిమిది వారాల్లోగా హెల్త్ కార్డు వ్యవస్థలో ఉన్న లోపాలు, పెండింగ్ సమస్యలు, సేవల మెరుగుదల, ఆస్పత్రుల అనుసంధానం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలి. అనంతరం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలను చేపడతారని జీవోలో పేర్కొన్నారు.

కమిటీలో సీఎస్ తో పాటు ఈ అధికారులు, ప్రతినిధులు ఉంటారు:
– జీఎడీ శాఖకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ప్రధాన కార్యదర్శి/కార్యదర్శి
– ఆర్థిక శాఖలో హెచ్‌ఆర్ వ్యవహారాలు చూసే కార్యదర్శి
– వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి
– ఏపీ ఎన్‌డబ్ల్యూఓ అధ్యక్షుడు విద్యాసాగర్
– ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
– ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో

ఈ కమిటీ ఏర్పాటుతో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న హెల్త్ కార్డు సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి