వివాహితుడైన ప్రియుడి ఇంట్లో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అతని భార్య అకస్మాత్తుగా రావడంతో జరిగిన పరిణామాలు ప్రాణాంతక స్థాయికి చేరుకున్నాయి. ఆపదలో పడిన ఓ మహిళ, బయటపడేందుకు 10వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించిన దృశ్యాలు చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లో వెలుగు చూశాయి.
ఘటన వివరాల్లోకి వెళితే—ఓ వ్యక్తి తన ప్రియురాలితో ఇంట్లో ఉన్న సమయంలో, ఎలాంటి సమాచారం లేకుండానే అతని భార్య ఇంటికి చేరుకుంది. దీంతో తీవ్ర ఆందోళనకు లోనైన ఆ వ్యక్తి, ప్రియురాలిని బాల్కనీలో దాక్కోవాలని చెప్పాడు. పై అంతస్తు నుంచి కింద చూడటమే భయంకరంగా అనిపించేంత ఎత్తులో ఉన్న బాల్కనీ రెయిలింగ్‌ను పట్టుకుని ఆ మహిళ వేలాడుతూ ప్రాణాలను పణంగా పెట్టింది. అనంతరం భవనం వెలుపల ఉన్న పైపులు, కిటికీ అంచులను ఆశ్రయిస్తూ ఒక దాని తర్వాత ఒకటిగా జాగ్రత్తగా కిందకు దిగడం ప్రారంభించింది.
ఈ సన్నివేశాన్ని కింద ఉన్న ప్రజలు భయంతో, ఆందోళనతో వీక్షించారు. కొంతదూరం దిగిన తర్వాత, ఆమె ఓ ఇంటి కిటికీని తట్టి సహాయం కోరింది. పరిస్థితి అర్థం చేసుకున్న ఆింటి యజమాని వెంటనే కిటికీ తెరిచి ఆమెను గట్టిగా లోపలికి లాగడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ప్రియుడి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “పిరికివాడిలా ప్రవర్తించాడు” అని దుమ్మెత్తిపోశారు. మరోవైపు మహిళ చర్యపై విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తే, మరికొందరు భద్రతా పరికరాలు లేకుండా ఇంతటి సాహసం చేయడం మూర్ఖత్వమని విమర్శించారు. “ఒక్క అడుగు తప్పినా ప్రాణాలు పోయేవి” అని ఒకరు వ్యాఖ్యానించగా, “ఎవరి కోసమో తమ ప్రాణాలను ఇలా ప్రమాదంలో పెట్టడం సరికాదు” అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే, చైనాలో విడాకుల రేటు పెరుగుతున్న విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. 1998 నుంచి 2018 మధ్య విడాకుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం, విడాకులు కోరే దంపతులకు 30 రోజుల ‘కూలింగ్-ఆఫ్’ పీరియడ్‌ను తప్పనిసరి చేస్తూ చర్యలు తీసుకుంది.



