సంక్రాంతికి ఇంకా నలభై రోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ, నగరంలో మాంజా ప్రమాదాలు ఇప్పటికే మొదలైపోయాయి. తాజాగా హైదరాబాద్ గుర్రంగూడ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కార్తీక్ ఈ తీక్షణమైన మాంజా దాడికి బలై తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపుతోంది.
బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మాంజా చుట్టుకుంది
కార్తీక్ తనకు కాబోయే భార్యతో కలిసి ఇంటి నుంచి నాగోలు వైపు బైక్‌పై వెళ్తుండగా, కామినేని ఫ్లైఓవర్ ఎక్కిన కొద్ది క్షణాల్లోనే అతడి మెడకు ఏదో బలంగా తాకినట్లు అనిపించింది. ఏమైందో అర్థం కాక ఆపి చూసేలోపు మాంజా అతడి మెడను లోతుగా కోసేసింది. హెల్మెట్ ఉన్నప్పటికీ, మాంజా మెడ భాగాన్ని చీల్చి కండరాలు, పై భాగం రక్తనాళాలు తెగిపోయేలా గాయపరిచింది.
అదృష్టవశాత్తు లోపల ఉండే ప్రధాన రక్తనాళాలు, శ్వాసనాళం దెబ్బతినకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, బాహ్య రక్తనాళాలు తెగిపోవడం వల్ల భారీగా రక్తం కారింది. దీంతో అక్కడి నుంచి వెళ్తున్న వ్యక్తి ఈ స్థితిని గమనించి వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించారు.
వెంటనే శస్త్రచికిత్స – అరగంటలో ప్రాణాలు కాపాడిన వైద్యులు
కామినేని ఆస్పత్రి వైద్యులు గాయాలను పరిశీలించగా రక్తనాళాల విరుగుడు స్పష్టంగా గుర్తించారు. ఎమర్జెన్సీ విభాగంలో రక్తస్రావం ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తక్షణమే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
అరగంటలోపే ఆపరేషన్ ప్రారంభించి, తెగిపోయిన రక్తనాళాలను తిరిగి అతికించడంతో పాటు కండరాలను కూడా కుట్టి కార్తీక్ పరిస్థితిని స్థిరపరిచారు. ప్రమాద సమయంలో మాంజాను చేత్తో తీసేందుకు ప్రయత్నించడంతో అతడి చేతి వేళ్లకు కూడా గాయాలయ్యాయి. అతడి వెనుక కూర్చున్న యువతికి కూడా మెడ, కంటి దగ్గర స్వల్ప గాయాలు అయ్యాయి.
ఇంకా 40 రోజులు ఉన్నా… మాంజా దాడులు ప్రారంభం
సంక్రాంతి సమయం రాకముందే కొందరు కైట్స్ ఎగరేయడం ప్రారంభించడంతో మాంజా ప్రమాదాలు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గాజు పూసిన మాంజాలు అత్యంత ప్రమాదకరమైనవి. అవి తెగిపోయి రహదారులపై వేలాడుతూ రెండు చక్రాల వాహనదారుల ప్రాణాలను ముప్పుతిప్పలు పెడుతున్నాయని డాక్టర్ రిషిత్ బత్తిని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారులు ఇప్పటినుంచే కఠిన చర్యలు చేపట్టకపోతే సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి ప్రాణాంతక ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
కాపాడినది కూడా ఒక కామినేని వైద్యుడే: కార్తీక్
ప్రమాదం సంభవించినప్పుడు తానెరిగకుండా తనను రక్షించిన వ్యక్తి కూడా కామినేని ఆస్పత్రి వైద్యుడేనని కార్తీక్ వెల్లడించారు.
కార్తీక్ వివరాలు ఇలా ఉన్నాయి:
“నాగోలు వైపు వెళ్తుండగా ఒక్కసారిగా మెడకు బలంగా ఏదో కోసినట్లు అనిపించింది. చెయ్యి పెట్టి చూసేదాకా హెల్మెట్ లోపలే మాంజా కనిపించింది. చేతివేళ్లు కూడా కోసుకుపోయాయి. పక్కకు ఆపేసరికి చెయ్యి మొత్తం రక్తంతో తడిసి ఉంది.
ఆ సమయంలో అటుగా వచ్చిన వైద్యుడు తన కర్చీఫ్ ఇచ్చి గాయాన్ని అదిమిపట్టమన్నారు. కొన్ని ఆటోలు ఆపినా ఆగలేదు. అప్పుడు ఆయనే తన బైక్‌పై ఎక్కించి కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీలో చేర్చిన అరగంటకే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. నన్ను రక్షించిన వ్యక్తి ఒక వైద్యుడేనన్న విషయం తర్వాత తెలిసింది. ఇంకా సంక్రాంతికి చాలా సమయం ఉంది… ఇప్పటినుంచే ఇలా మాంజా ప్రమాదాలు పెరగడం చాలా ప్రమాదకరం” అని కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశారు.



