చిన్నారి తెలివితేటలు, ధైర్యం ఒక ప్రాణాన్ని ఎలా కాపాడగలవో పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన మరోసారి చూపించింది. క్షణం ఆలస్యమైనా, భయంతో స్థబ్దుకైనా తన కళ్లముందే తల్లిని కోల్పోయే పరిస్థితి. కానీ ఐదో తరగతి చదువుతున్న చిన్నారి దీక్షిత్ చూపిన సమయస్ఫూర్తి, చురుకుదనం చివరికి ఒక నిండు ప్రాణాన్ని రక్షించింది.
భీమవరం మండలం జొన్నలగరువు గ్రామానికి చెందిన దీక్షిత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. స్కూల్లో ‘మెగా పేరెంట్స్ డే’ నిర్వహించడంతో తల్లిదండ్రులంతా మీటింగ్‌కు హాజరయ్యారు. తన తల్లి కూడా వస్తానని చెప్పినా, చాలా సేపు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన దీక్షిత్ పరుగెత్తుకుంటూ ఇంటికెళ్లాడు.
అక్కడ కనిపించిన దృశ్యం అతన్ని కుదిపేసింది. ఇంటి బయట ఉన్న మంచినీటి మోటార్‌కు సంబంధించిన తెగిన వైరు తగలడంతో అతని తల్లి విద్యుత్ షాక్‌కు గురై కొట్టుమిట్టాడుతోంది. ఆ దృశ్యం చూసి భయపడినా, ఆపదలో ఉన్న తల్లిని రక్షించడానికి ఏమి చేయాలో క్షణాల్లో అర్థం చేసుకున్నాడు.
తల్లిని పట్టుకునే ప్రయత్నం చేస్తే తానూ కరెంటు బారిన పడతాడని గ్రహించిన దీక్షిత్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఆ మోటార్ స్విచ్‌ను ఆఫ్ చేశాడు. కరెంటు సరఫరా నిలిపిన తర్వాత జాగ్రత్తగా తల్లికి తగిలిన వైర్‌ను తొలగించి, ఆమెను పైకి లేపి సమీపంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు.
డాక్టర్ ప్రథమ చికిత్స ఇవ్వడంతో తల్లి పరిస్థితి స్థిరంగా మారింది. అనంతరం ఆమెతో కలిసి తిరిగి స్కూల్‌లో జరుగుతున్న పేరెంట్స్ డే కార్యక్రమానికి వెళ్లాడు. దీక్షిత్‌కు మూడో తరగతి చదువుతున్న ఒక చెల్లి కూడా ఉంది.
దీక్షిత్ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం అందరి ప్రశంసలు అందుకుంటోంది. చిన్నారులకు ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, విద్యుత్ ప్రమాదాలపై ఎలా అప్రమత్తంగా ఉండాలనే విషయాలలో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.



