కేరళలో NH-66 మళ్లీ కుంగింది: కొత్త రహదారి పగుళ్లు – నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు

కేరళలో మరోసారి జాతీయ రహదారి కుంగిన ఘటన కలకలం రేపింది. కొట్టియం–మైలక్కడ్ ప్రాంతాన్ని దాటే 66వ జాతీయ రహదారి (NH-66) కొత్తగా నిర్మాణం పూర్తిచేసిన కొద్ది నెలలకే భారీ పగుళ్లతో ఒక్కసారిగా కుంగిపోవడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రహదారి కుంగిన సమయంలో ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న నాలుగు వాహనాలు పగుళ్లలో ఇరుక్కుపోయాయి. శుభవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు.

ఇటీవలి కాలంలో ఇదే హైవేపై వరుసగా రెండోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కొద్ది నెలల క్రితం కోట్టక్కల్ ప్రాంతంలో కూడా రోడ్డు కుంగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా నిర్మించిన హైవేలే ఇలా కుప్పకూలడం, భారీ మొత్తం ప్రజా ధనం పెట్టుబడి పెట్టిన రోడ్లు కొద్ది నెలలు కూడా నిలవక పోవడం పై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ పనితనంపై ప్రశ్నలు లేవనెత్తుతూ నిర్మాణ నాణ్యతను పరిశీలించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై శనివారం కేరళ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ వీడియోను పోస్ట్ చేసింది. “కేరళలో ఎన్‌హెచ్-66 మళ్లీ కుంగిపోయింది. ఈసారి కొట్టియం సమీపంలో రహదారి కుప్పకూలింది. నాలుగు వాహనాలు ఇరుక్కున్నాయి, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కొద్ది నెలల క్రితం కోట్టక్కల్ దగ్గర కూడా ఇదే తరహా ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణాల నాణ్యత ఏ స్థాయిలో ఉందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. అసలు కాంట్రాక్ట్ విలువ ఎంత? వాస్తవానికి ఎంత ఖర్చు చేశారు? ఎన్‌హెచ్-66 ఎప్పుడైనా కుంగిపోయే టైమ్ బాంబ్‌లా మారిపోయింది. భారీ కాంట్రాక్టుల్లో అవకతవకలు వెలుగుచూస్తున్నందున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మౌనం వహిస్తున్నారా? ఇప్పుడు ప్రజలు తమ భద్రతను తాము చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.

కుంగిపోయిన రహదారి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేరళలో కీలక మార్గంగా పేరుగాంచిన ఈ హైవేపై వరుస ఘటనలు జరగడం ఆ రాష్ట్ర రవాణా వ్యవస్థను ప్రశ్నార్థకంగా నిలిపింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి