రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యరాయ్ మెరిసిన సందర్భం – మిస్ వరల్డ్ టైటిల్ తన జీవితం ఎలా మార్చిందో చెప్పిన నటి

రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో మరొకసారి భారతీయ సినీ కళాకారిణి ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన అద్భుతమైన హాజరుతో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ అండ్ వైట్ ఎలిగెంట్ అవుట్‌ఫిట్‌లో ప్రేక్షకుల దృష్టిని కట్టిపడేసిన ఆమె, ఈ వేదికపై తన మూడు దశాబ్దాల ప్రయాణాన్ని స్మరించుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ కిరీటం తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసిన మలుపుగా నిలిచిందని ఆమె స్పష్టం చేశారు.

ఆ రోజుల జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకున్న ఐశ్వర్య, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడం పూర్తిగా అనూహ్యమని, అయితే దానిని ఒక సాధారణ బ్యూటీ కాంటెస్ట్‌గా చూడలేదని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతినిధిగా నిలబడే అరుదైన అవకాశం లభించిందన్న భావనతోనే పోటీలో పాల్గొన్నానని చెప్పారు. ఆ సమయంలో భారతదేశం గురించి ప్రపంచానికి పరిమితమైన అవగాహన ఉండటం తనను ఆశ్చర్యపరిచిందని, అందుకే తన ద్వారా దేశపు సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నానని వివరించారు.

మిస్ వరల్డ్ టైటిల్ తరువాత తన కెరీర్ అసలు గమనాన్ని సంతరించుకున్నదని ఐశ్వర్య చెప్పారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ‘ఇరువర్’ తో తన సినీ ప్రస్థానం మొదలైందని, అదే ఏడాది బాలీవుడ్ నుంచి కూడా ఎంతోమంది దర్శకులు అవకాశాలు అందించారని గుర్తుచేశారు. ఆమె కెరీర్‌లో అత్యంత ప్రముఖమైన చిత్రాల్లో ‘దేవదాస్’ ఒకటని, ఆ సినిమా తర్వాత కథల ఎంపిక విషయంలో మరింత స్పష్టత, నమ్మకం పెరిగిందని తెలిపారు.

తనను ఇప్పటికీ ప్రేమతో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఐశ్వర్య, ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో కనిపించిన సంగతి తెలిసిందే.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి