అంతర్జాతీయ ఆటగాళ్లే ఓడిపోయారు.. మూడేళ్ల చిన్నారి చెస్ అద్భుతం

మూడేళ్ల కుర్రాడి చెస్ టాలెంట్‌కు దేశం షాక్
ఫోన్ మాన్పించే ప్రయత్నంలోనే ఓ అద్భుతం పుట్టింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన సర్వజ్ఞ సింగ్ కుశ్వాహ ప్రస్తుతం ప్రపంచ చెస్ వేదికపై తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కేవలం 3 సంవత్సరాలు 7 నెలలు 20 రోజుల వయసులోనే FIDE (ఫీడే) రేటింగ్‌ 1572 సాధించి అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

ఫోనుకు బానిసగా మారడంతో చెస్ నేర్పిన తల్లిదండ్రులు

బాలుడు చిన్నప్పటి నుంచే అతిగా ఫోన్ ఉపయోగించడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. ఫోన్ నుంచి దృష్టి మళ్లించేందుకు వారు ఇంట్లోనే చెస్ పరిచయం చేశారు. చురుకైన బుద్ధి కలిగిన సర్వజ్ఞ తక్కువ సమయం లోనే ఆట పట్ల విపరీత ఆసక్తి చూపాడు.

కొద్ది రోజులకే తల్లిదండ్రులను ఓడించే స్థాయికి రావడంతో, అతడిని ప్రొఫెషనల్ కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు. కోచ్‌లైన నితిన్ చౌరాసియా, ఆకాశ్ ప్యాసీ మార్గదర్శకత్వంలో రోజుకు ఆరు గంటల పాటు శిక్షణ తీసుకున్నాడు.

మూడు ఇంటర్నేషనల్ ప్లేయర్లను ఓడించాడు

FIDE ర్యాంక్ కోసం కనీసం ఒక అంతర్జాతీయ ఆటగాడిని ఓడించడం తప్పనిసరి. కానీ సర్వజ్ఞ తన మొదటి టూర్నమెంట్లలోనే వరుసగా ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీని ఫలితంగా అతనికి ప్రపంచ ర్యాంకింగ్ వచ్చి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన చెస్ ఆటగాడిగా నిలిచాడు.

గతంలో ఈ రికార్డు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనీష్ సర్కార్‌ పేరిట ఉండగా, సర్వజ్ఞ అతనికంటే ఇంకా చిన్న వయసులోనే గుర్తింపు సంపాదించాడు.

గ్రాండ్‌మాస్టర్ లక్ష్యం

ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“మా కుమారుడు అంతర్జాతీయ ర్యాంక్ సాధించడం మా గర్వకారణం. భవిష్యత్తులో అతడిని గ్రాండ్‌మాస్టర్‌గా చూడాలని మా ఆశ” అని తండ్రి సిద్ధార్థ్ సింగ్ తెలిపారు.

సర్వజ్ఞ ఇప్పటివరకు ఖండ్వా, భోపాల్, చింద్వారా, మంగళూరు వంటి చోట్ల టోర్నమెంట్లు ఆడి అనేక విజయాలు నమోదు చేశాడు. సర్వజ్ఞ రికార్డు ప్రపంచ చెస్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి