ఢిల్లీ కరోల్ బాగ్‌లో భారీ ఐఎంఈఐ ట్యాంపరింగ్ రాకెట్ బస్టు – 1800 మొబైళ్లు స్వాధీనం

దేశ రాజధాని ఢిల్లీలో అక్రమ మొబైల్ తయారీ రాకెట్‌ను పోలీసులు చేధించారు. కరోల్ బాగ్‌లోని ఓ ఇరుకైన గల్లీలో రహస్యంగా నడుస్తున్న మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్‌పై ప్రత్యేక బృందం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. ఈ యూనిట్‌లో పాత మొబైళ్లను విడగొట్టి, కొత్త బాడీలతో కలిపి కొత్త ఫోన్లుగా మార్చడం మాత్రమే కాదు, వాటి ఐఎంఈఐ నంబర్లను కూడా అక్రమ సాఫ్ట్‌వేర్‌తో మార్చుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

దాడిలో 1,800కు పైగా మొబైల్ ఫోన్లు, వేలాది విడిభాగాలు, ఐఎంఈఐ ట్యాంపరింగ్‌కు ఉపయోగించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌, ల్యాప్‌టాప్‌లు, స్కానింగ్ పరికరాలు, ముద్రించిన నకిలీ ఐఎంఈఐ లేబుళ్లు స్వాధీనం అయ్యాయి. గత కొంతకాలంగా సెంట్రల్ ఢిల్లీలో నమోదైన ఐఎంఈఐ ట్యాంపరింగ్ కేసుల్లో ఇదే అతిపెద్దదిగా అధికారులు అభివర్ణించారు.

సెంట్రల్ డీసీపీ నిధిన్ వల్సన్ తెలిపిన వివరాల ప్రకారం — నిందితులు పాత సామాన్ల మార్కెట్‌ల నుంచి మొబైళ్లు కొనుగోలు చేసి వాటిలోని మదర్‌బోర్డులను విడిచేవారు. ఆ తర్వాత చైనా నుంచి అక్రమంగా తెప్పించిన కొత్త మొబైల్ బాడీలతో కలిపి కొత్త యూనిట్లుగా అసెంబుల్ చేస్తూ, “WRITEIMEI 0.2.2” అనే సాఫ్ట్‌వేర్ సాయంతో ప్రతి ఫోన్‌కు కొత్త ఐఎంఈఐ నంబర్‌ను రాయడంతో ఈ దందా నడుపుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నారు. ఈ వ్యవహారం సుమారు రెండేళ్లుగా సాగుతున్నట్లు నిందితులు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.

బీదన్‌పురా ప్రాంతంలో అనుమానాస్పద రాకపోకలు, పదిహేను రోజుల నిఘా, మరియు పక్కా సమాచారం ఆధారంగా పోలీసులు ఈ దాడి నిర్వహించారు. దాడి చేయగానే నిందితులు ల్యాప్‌టాప్‌లపై పనిచేస్తూ, ఫోన్లలో ఐఎంఈఐ నంబర్లు మార్చే ప్రక్రియలోనే పట్టుబడ్డారు.

ప్రస్తుతం నిందితులపై బీఎన్ఎస్, ఐటీ చట్టం, టెలికం చట్టం 2023 కింద కేసులు నమోదు చేశారు. ఈ రాకెట్ వెనుక ఉన్న సరఫరా శృంఖల, చైనా నుంచి విడిభాగాల స్మగ్లింగ్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు జరగవచ్చని అధికారులు సూచించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి