భారతదేశంలో నెంబర్ ప్లేట్ ధరలు సాధారణంగా కొన్ని వేలు లేదా అత్యధికంగా కొన్ని లక్షలు మాత్రమే చేరుకుంటాయి. అయితే ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది. దేశంలోనే అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్‌గా HR88B8888 సంచలన రికార్డు సృష్టించింది. ఈ నెంబర్ అక్షరాలా రూ. 1 కోటి 17 లక్షలకు అమ్ముడైంది. ఒక సాధారణ కారు రిజిస్ట్రేషన్ నంబర్‌కు ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం ఆటోమొబైల్ రంగాన్ని, సాధారణ ప్రజలను ఆశ్చర్యపరిచింది.
హరియాణాలో ఆన్‌లైన్ వేదిక ద్వారా ప్రతీవారం వీఐపీ నంబర్ ప్లేట్లకు వేలం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజా వేలంలో HR88B8888 అనే నంబర్‌పై పోటీ హోరాహోరీగా సాగింది. మొత్తం 45 మంది బిడ్డర్లు పాల్గొన్న ఈ వేలంలో రూ. 50 వేల బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన బిడ్డింగ్, వరుసగా పెరుగుతూ చివరకు రూ. 1.17 కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇది ఇప్పటివరకు దేశంలో నమోదు అయిన మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ నెంబర్ ప్లేట్గా నిలిచింది.
ఇదే వేలం వేదికలో గత వారం HR22W2222 అనే నంబర్ ప్లేట్ రూ. 37.91 లక్షలకు అమ్ముడైంది. కానీ ఈసారి వచ్చిన HR88B8888 ధర ఆ రికార్డును దాదాపు మూడు రెట్లు అధిగమించింది. అయితే ఈ నెంబర్‌ను ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. అధికారులు కూడా ఈ రికార్డు ధరపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
HR88B8888 — ఎందుకు ఇంత డిమాండ్?
ఈ నెంబర్‌కు ప్రత్యేకత ఏమిటంటే — వరుసగా ఉన్న ‘8888’. చైనాలోనే కాదు, భారతదేశంలోని వ్యాపార వర్గాల్లో కూడా 8 అనే సంఖ్యను అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అదనంగా ఈ నంబర్‌లో ఉన్న ‘B’ క్యాపిటల్ లెటర్ ఆకారంగా 8ను పోలి ఉండటంతో మరింత సింబాలిక్ ప్రాధాన్యం పెరిగింది. ఈ కారణంగానే బిడ్డర్లు ధరను ఎలాంటి సంకోచం లేకుండా కోట్ల వరకు పెంచారు.
హరియాణా ప్రభుత్వం నిర్వహించే fancy.parivahan.gov.in ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఇలాంటి ఫ్యాన్సీ నంబర్లకు ప్రతి వారం వేలం జరుగుతుండగా, HR88B8888 ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అత్యంత విలువైన VIP నెంబర్‌గా ట్రెండ్ అవుతోంది.



