దేశంలో ఆధార్ కార్డు అవసరంపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి భారత పౌరుడి ప్రాధమిక గుర్తింపు పత్రంగా నిలిచిపోయిన ఆధార్ ఇప్పుడు కీలక మార్పుల దశలోకి వెళ్లబోతోంది. కేంద్ర ప్రభుత్వం, UIDAI కలిసి ఆధార్ కార్డును పూర్తిగా ఆధునిక రూపంలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. త్వరలోనే ప్రస్తుత ఆధార్ కార్డు ఫార్మాట్ పూర్తిగా మారిపోయి, కేవలం వ్యక్తి ఫోటో మరియు QR కోడ్ మాత్రమే ఉండే విధంగా కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఆధార్ మార్పుల వెనుక అసలు కారణం ఏమిటి?
UIDAI ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం: పౌరుల వ్యక్తిగత గోప్యత రక్షణ.
UIDAI CEO భువనేష్ కుమార్ ప్రస్తుతం ఆధార్ కార్డు పైనే స్పష్టంగా ముద్రితమై ఉండే చిరునామా, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సులభంగా దుర్వినియోగానికి గురవుతున్నాయని వెల్లడించారు. హోటళ్లు, సిమ్ విక్రేతలు, ఈవెంట్ నిర్వహకులు ఇలా అనేక చోట్ల ప్రజలు సంకోచం లేకుండా ఆధార్ ఫోటోకాపీ ఇస్తున్నారు. దీంతో సున్నితమైన వివరాలు చేతుల మీదుగా మారుతూ… ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఈ సమస్యను నివారించేందుకు:
- కార్డు మీద కీలక వివరాలను తొలగించడం,
- వాటిని సురక్షిత QR కోడ్‌లో మాత్రమే నిల్వచేయడం,
- డిజిటల్ వాలిడేషన్ ద్వారానే ఆధార్‌ను ఉపయోగించుకునే విధంగా వ్యవస్థను రూపొందించడం
అనే కీలక నిర్ణయం UIDAI తీసుకుంది.
భువనేష్ కుమార్ ప్రకారం, “ప్రజలు ఆధార్ కార్డుపై ముద్రిత వివరాలను ప్రధాన గుర్తింపు పత్రంగా భావిస్తున్నారు. దీంతో దుర్వినియోగం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే భవిష్యత్తులో ఆధార్ కార్డు పైన కేవలం ఫోటో & QR కోడ్ మాత్రమే ఉండేలా మార్పులు చేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
ఫోటోకాపీ కల్చర్‌కు ఇక ముగింపు – కొత్త నియమాలు డిసెంబర్ నుంచే
భారతీయులకు ఎక్కడైనా ఐడీ అడిగినా అధార్ ఫోటోకాపీ ఇవ్వటం సహజం. కానీ ఈ అలవాటు ఇక శాశ్వతంగా ముగియనుంది.
UIDAI త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త నిబంధనల ప్రకారం:
- ఆధార్ ఇక భౌతిక పత్రంగా ఉపయోగించుకోలేరు
- ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ పూర్తిగా నిలిపివేయబడుతుంది
- ఆధార్ ప్రయోజనం పొందాలంటే తప్పనిసరిగా
ఆన్లైన్ నంబర్ వెరిఫికేషన్ లేదా QR కోడ్ స్కాన్ చేయాలి
దీంతో నకిలీ ఆధార్ కార్డుల తయారీ, వ్యక్తిగత వివరాల దుర్వినియోగం వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.
mAadhaar ముగింపు… కొత్త “సూపర్ యాప్” ఎంట్రీ
ఆధార్ కార్డు మాత్రమే కాదు, ఆధార్ యాప్ కూడా భారీగా మారబోతోంది. UIDAI ప్రస్తుతం ఉన్న mAadhaar యాప్‌ను పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో ఒక కొత్త “సూపర్ యాప్” తీసుకురానుంది.
ఈ కొత్త యాప్‌ను:
- డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (DPDP యాక్ట్) ప్రమాణాలకు అనుగుణంగా
- మరింత గట్టి సెక్యూరిటీతో
- ఆధునిక ఫీచర్లతో
- రాబోయే 18 నెలల్లో విడుదల చేయనున్నట్లు UIDAI వెల్లడించింది.
ఈ కొత్త యాప్‌లో ఉండబోయే ముఖ్య ఫీచర్లు:
- ఇంటి నుంచే ఆధార్ చిరునామా మార్పు
- కుటుంబ సభ్యులు (మొబైల్ లేని వారితో సహా) ఒకే యాప్‌లో చేర్చుకునే అవకాశం
- సురక్షిత డిజిటల్ ఆధార్ షేరింగ్
- అధిక స్థాయి QR స్కాన్ వెరిఫికేషన్



