హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం ప్రముఖ కవి, గాయకుడు, రచయిత అందెశ్రీ సంస్మరణ సభ జరుగగా, ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ గడ్డపై ఎవరి ఆధిపత్యాన్నీ ప్రజలు ఎన్నటికీ అంగీకరించరని స్పష్టం చేస్తూ, దళిత–గిరిజనులపై గతంలో జరిగిన అధికారం ప్రదర్శనలపై ప్రజలు తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేసారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లోనే బండి యాదగిరి రూపొందించిన ‘బండె నక బండి కట్టి’ గీతం నిజాం పీఠాన్నే కంపింపజేసిందని పేర్కొన్నారు.
గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందెశ్రీ వంటి మహత్తర వ్యక్తులే మలిదశ ఉద్యమానికి ప్రాణం పోశారని, ఆ ఉద్యమానికి పునాది వేసిన వీరిని రాష్ట్రం ఎప్పటికీ మరువదని సీఎం అన్నారు. బడికి వెళ్లని అందెశ్రీ, అక్షరాలన్నీ తన హృదయం నుంచే పుట్టినట్లుగా తెలంగాణ ఉద్యమాన్ని ఊపందించారని ఆయన అభినందించారు.
ఉద్యమ దశలో ఏ సభ అయినా అందెశ్రీ పాట లేకుండా జరగలేదని, “జయ జయ హే తెలంగాణ” గీతం ప్రపంచమంతా తెలంగాణ గుర్తింపుకు ప్రతీకగా నిలిచిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ గీతాన్ని ప్రజలు పెట్టిన గౌరవమే చివరకు దానిని రాష్ట్ర గీతంగా ప్రకటించేలా కాంగ్రెస్ మంత్రివర్గం నిర్ణయం తీసుకువచ్చిందని చెప్పారు.
ఉద్యమ కాలంలో కవుల గానాలను అణచివేయడానికి అప్పటి పాలకులు ప్రయత్నించినప్పటికీ, సాహిత్య స్వరాలను ఎవరూ అణగదొక్కలేకపోయారని వ్యాఖ్యానించారు. “పెన్నులపై మన్ను కప్పితే అవి గన్నులవుతాయి” అని చెప్పిన అందెశ్రీ భావజాలం నేటికీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోందని అన్నారు.
రాష్ట్ర సాధనకు, నేడు తాను ముఖ్యమంత్రి హోదాలో నిలవడానికి కవులు, కళాకారులు, ఉద్యమ కారుల త్యాగాలే కారణమని స్పష్టం చేసిన సీఎం, వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. అందెశ్రీ రచించిన ‘నిప్పుల వాగు’ పుస్తకాన్ని రాష్ట్రంలోని ప్రతి లైబ్రరీలో అందుబాటులో ఉంచే చర్యలను చేపడతామని తెలిపారు.
తొమ్మిది మంది ఉద్యమకారులను సన్మానిస్తూ, వారికి 300 గజాల స్థలం కేటాయించడం, భారత్ ఫ్యూచర్ సిటీలో ఇండ్లు నిర్మించి ఇవ్వడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. దళితుల వల్లే గ్రామాల్లో నాయకత్వం వహించగలిగామని, ఎస్సీ వర్గీకరణ అమలుకు ఎంతటి ఒడిదుడుకులు వచ్చినా తన ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వర్గీకరణ అమలు చేయడం ద్వారా దళితులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
అందెశ్రీ కేవలం ఒక కవి మాత్రమే కాదని, ఆయన తెలంగాణకు కోహినూరు వజ్రంలా వెలిగిపోయిన మహానుభావుడని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.



