రాష్ట్రంలో మావోయిస్టుల కదలిక సంచలనం: అరెస్టులతో కలకలం

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా మావోయిస్టుల కదలిక పెరగడం రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలకు కారణమైంది. ఎన్నేళ్లుగా ఎలాంటి చలనం కనిపించనివారు అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోకి వచ్చి, ముఖ్య నగరాల్లో తలదాచుకోవడం, వారి వద్ద భారీగా ఆయుధాలు లభించడం సంచలనంగా మారింది.

ప్రత్యేకంగా అల్లూరి జిల్లా మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్‌లో హతమైన గంటల వ్యవధిలోనే విజయవాడ, ఏలూరు, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో దాగి ఉన్న 50 మందిని పోలీసులు అరెస్టు చేయడం పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోంది. ఒక్క విజయవాడలోనే 30 మంది పట్టుబడటం వారు ఏదో భారీ ఆపరేషన్ కోసం వచ్చినట్టు అనుమానాలు రేకెత్తిస్తోంది.

రాష్ట్ర రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు మకాం వేసినట్టు బయటపడటం మరింత సునామీలా మారింది. అధికారిక రాజధాని అమరావతే అయినప్పటికీ, రాష్ట్ర రాజకీయాలన్నీ విజయవాడ కేంద్రంగానే నడుస్తాయి. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు తరచూ రాకపోకలు జరిగే నగరం కావడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి అనేక అనుమానాలకు తావిస్తోంది.

దండకారణ్య ప్రాంతంలో బలహీనపడిన మావోయిస్టులు తిరిగి తమ శక్తిని చాటుకోవాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా వీవీఐపీ మూమెంట్ అధికంగా ఉండే విజయవాడను లక్ష్యంగా ఎంచుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. దేవ్ జీ, హిడ్మా అనుచరులు పట్టుబడిన దృష్ట్యా ఈ అనుమానం మరింత బలపడుతోంది. న్యూ ఆటోనగర్‌కు సమీపంలోని పోరంకి ప్రాంతంలోని ఓ కన్వెన్షన్ హాలులో జరిగే కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచుగా హాజరవుతారన్న అంశం కూడా విచారణలో కీలకంగా మారింది.

పది రోజుల క్రితం కూలీల వేషంలో వచ్చిన మావోయిస్టులు న్యూ ఆటోనగర్‌లోని ఒక కమర్షియల్ భవనం మూడో అంతస్తును అద్దెకు తీసుకుని తలదాచుకున్నట్టు గుర్తించారు. చుట్టూ పూర్తిగా షట్టర్లు ఉన్న ఆ స్థలం బయటకు కనిపించకుండా ఉండేలా ఉండడంతో, వారు ఎప్పుడూ బయటకు రాకుండానే అక్కడే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. వారికి ఉదయం నుంచి రాత్రి వరకు భోజనం ఒకే కారులో వచ్చి అందించేదని కూడా సమాచారం.

క్రమంగా అనుమానం రావడంతో స్థానికులు ఆ కారు డ్రైవర్‌ను ప్రశ్నించగా, తాము కూలీలమని, కంపెనీ ప్రారంభానికి సమయం ఉండడంతో వారికి భోజనం అందిస్తున్నామని చెప్పాడట. కూలీలుగా భావించిన స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే పోలీసుల అరెస్టుల తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడు ప్రధాన ప్రశ్న—వారికి మూడు పూటలు భోజనం అందించినది ఎవరు?
విజయవాడకు చెందిన ఓ మహిళ మావోయిస్టు సానుభూతిపరురాలిగా ఉండి, ఆహార సరఫరా బాధ్యతలు చూసుకుందని తెలుస్తోంది. ఆమె ఎవరో తెలియాలని స్థానికులు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి