బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష తీర్పు—నవంబర్ 17 తేదీపై రాజకీయ వివాదం ఎందుకు?

బంగ్లాదేశ్ మరోసారి అంతర్జాతీయ వేదికపై హాట్‌టాపిక్‌గా మారింది. కారణం—మాజీ ప్రధాని షేక్ హసీనాపై అంతర్జాతీయ నేర విచారణ ట్రైబ్యునల్‌ (ICT) వెలువరించిన మరణశిక్ష తీర్పు. ఈ తీర్పు ప్రకటించడానికి ఎంచుకున్న తేదీ నవంబర్ 17 కావడం దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. ఎందుకంటే అదే రోజు హసీనాకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం—ఆమె వివాహ వార్షికోత్సవం. ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త ఎం.ఎ. వాజెద్ మియాతో ఆమె వివాహం జరిగిన తేదీ అదే. ఇంత ముఖ్యమైన రోజునే కోర్టు మరణశిక్ష ప్రకటించడాన్ని చాలా మంది ఉద్దేశపూర్వక నిర్ణయంగానే భావిస్తున్నారు.

తేదీ మార్పు వెనుక రాజకీయ ఉద్దేశమా?

ICT మొదట విచారణ సమాప్తమైన తర్వాత నవంబర్ 14న తీర్పు ఇచ్చినట్లు ప్రకటించింది. అయితే అకస్మాత్తుగా తేదీని నవంబర్ 17కి మార్చింది. ఈ మార్పు వెంటనే సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. ఇది యాదృచ్చికమా? లేక హసీనాను వ్యక్తిగతంగా అవమానించేందుకు చేసిన రాజకీయ వ్యూహమా? అనే ప్రశ్నలపై బంగ్లాదేశ్ పౌరులు రెండువర్గాలుగా విడిపోయారు.

కొంతమంది నెటిజన్లు దీనిని “అత్యంత ఉద్దేశపూర్వక చర్య”గా అభివర్ణిస్తున్నారు. హసీనాను చులకన చేయడానికి, ఆమెకు బాధ కలిగించడానికి ప్రత్యేకంగా ఈ తేదీని ఎంచుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది కేవలం “సాధారణ యాదృచ్చికం”గా అభివర్ణిస్తూ—అయితే రాజకీయ ప్రతీకార వాసన మాత్రం మీగడలుగొడుతోందని అంటున్నారు.

కొంతమంది తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్‌పై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. “తేదీని మోసపూర్వకంగా మార్చారు”, “హసీనా వివాహ వార్షికోత్సవాన్ని ఆమెకు మరణశిక్ష తీర్పు దినంగా మార్చారు”—అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

ఇంకా అవామీ లీగ్ స్పష్టంగా స్పందిస్తూ—ఇది పూర్తిగా “రాజకీయ ప్రతీకారం” అని, హసీనాను లక్ష్యంగా చేసుకోవడానికి ICT‌ను “మోసపూరిత ట్రిబ్యునల్”గా ఉపయోగించారని ఆరోపిస్తోంది. “తీర్పు ముందే నిర్ణయించబడింది, న్యాయమైన వాదనకు అవకాశం ఇవ్వలేదు”—అని హసీనా వర్గం ఘాటుగా వ్యాఖ్యానిస్తోంది.


షేక్ హసీనా భర్త ఎం.ఎ. వాజెద్ మియా—ఒక పోరాట యోధుడు

హసీనా జీవిత భాగస్వామి, భౌతిక శాస్త్రవేత్త ఎం.ఎ. వాజెద్ మియా కూడా తన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. 1963లో పాకిస్థాన్ అణుశక్తి కమిషన్‌లో పనిచేయడం ప్రారంభించిన ఆయనను అక్కడి ప్రభుత్వం తరువాత “అన్యాయంగా” ఉద్యోగం నుంచి తొలగించింది.
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆయన తిరిగి బంగ్లాదేశ్ అణుశక్తి కమిషన్‌లో చేరి కీలక సేవలు అందించారు. శాస్త్రం, రాజకీయాలపై పలు ప్రాముఖ్యమైన గ్రంథాలను రచించి ప్రజల్లో విజ్ఞానాన్ని పంచడంలో కూడా ఆయన విశేష పాత్ర పోషించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి