జర్నలిజం పై అసాంఘిక శక్తుల పట్టు – పత్రికా దినోత్సవం అందించే సందేశం

నేడు జాతీయపత్రికా దినోత్సవం ప్రత్యేక కథనం

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1956లో తొలి ప్రెస్ కమిషన్ చేసిన సిఫార్సులపై 1966 నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. అప్పటి నుంచి ఈ రోజు దేశంలో పత్రికా విలువలు, పాత్రపై చర్చించేందుకు, జర్నలిజం ఆత్మను గుర్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.

ఏ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలంగా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే అక్కడి పత్రికా రంగాన్ని పరిశీలిస్తే సరిపోతుంది. పత్రికా స్వాతంత్ర్యం అడ్డంకులు లేకుండా అమలవుతుంటే, ఆ దేశంలో ప్రజాస్వామ్యం, చట్టపాలన దృఢంగా ఉన్నట్టే. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నా, ప్రజా సమస్యలను వెలుగులో పెట్టే జర్నలిస్టులు రోడ్డున పడే పరిస్థితులు వస్తే, అది కేవలం మీడియా వైఫల్యమే కాదు — ప్రభుత్వ వ్యవస్థల బలహీనతకూ సూచిక. జర్నలిస్ట్ రోడ్డున పడితే, వాస్తవానికి ప్రజాస్వామ్య పాలకులే రోడ్డున పడినట్టే.

జాతీయ పత్రికా దినోత్సవం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిళ్లు, ప్రమాదాలను గుర్తు చేస్తూ, అవన్నీ ఎదుర్కొంటూ జర్నలిజం విలువలను కాపాడాలని పిలుపునిస్తుంది. కానీ ప్రస్తుత మీడియా పరిస్థితులను పరిశీలిస్తే, ఇది సాధ్యమా? అనేది ప్రతి నిజాయితీగల జర్నలిస్టు మనసును వేధించే ప్రశ్న. నేటి భారత మీడియాలో 90 శాతం వరకు ప్రక్షాళన అవసరమని చాలామంది బహిరంగంగానే చెబుతున్నారు. కొన్నేళ్లుగా మీడియా రంగం దేశంలోనే అతిపెద్ద దోపిడీ వ్యవస్థగా మారిందని పౌరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటివేళ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాత్ర మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. మీడియా సంస్థలపై వచ్చిన ఫిర్యాదులను విచారించడం, వృత్తిపరమైన నైతికతను ఉల్లంఘించిన సంస్థలను ప్రశ్నించడం, అవసరమైతే అభిశంసించడం ఈ సంస్థ బాధ్యతల్లో భాగం. పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నది కూడా దాని ముఖ్య లక్ష్యం. ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రెస్ కౌన్సిళ్లు ఉన్నప్పటికీ, భారత ప్రెస్ కౌన్సిల్‌కు ప్రత్యేకత ఏమంటే — ప్రభుత్వ విభాగాలనైనా ప్రశ్నించే అధికారం కలిగి ఉంది. పత్రికలు స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని పాటించేలా ప్రోత్సహించగలగడం కూడా ఈ సంస్థ ప్రత్యేకత.

ప్రతి సంవత్సరం నవంబర్ 16న మీడియా సమస్యలు, జర్నలిజం విలువలపై ప్రెస్ కౌన్సిల్ దేశవ్యాప్తంగా సెమినార్లు నిర్వహిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, ఐక్యరాజ్యసమితి మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా ప్రకటించింది. మానవ హక్కుల ప్రకటనలోని 19వ ఆర్టికల్‌కు అనుగుణంగా ఈ దినోత్సవం రూపొందించబడింది.

కానీ ఇవన్నీ ఎంతవరకు అమలవుతున్నాయి? అనే ప్రశ్నను జర్నలిస్టులమైతే తప్పక మనసులో పెట్టుకోవాలి.
రాజకీయాలు మరియు జర్నలిజం — ఇవి ఎన్నడూ కలవకూడని రెండు వేర్వేరు మార్గాలు. కానీ నేడు కొన్ని అసాంఘిక శక్తులు పవిత్రమైన జర్నలిజాన్ని కవచంగా చేసుకొని స్వలాభ రాజకీయాలకు ఉపయోగించుకోవడం పెరిగింది. అలాంటి వారి చేతుల్లో పడ్డ జర్నలిజమే ఇప్పుడు పెద్ద రాజకీయంగా మారిపోయింది.

సమాజం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడాలంటే — జర్నలిజం దారి తప్పకూడదు. పత్రికా స్వేచ్ఛ, నిజాయితీ, ధైర్యం — ఇవే రంగానికి ప్రాణం.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి