నల్గొండ జిల్లాలో చోటుచేసుకున్న వైద్య నిర్లక్ష్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే 15 మంది పిల్లలు ఒక్కసారిగా అస్వస్థతకు గురవడం కుటుంబాలను భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటన అనంతరం ఆస్పత్రి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్యం వికటించిన సంఘటనతో చిన్నారుల్లో వాంతులు, విరోచనాలు, అధిక జ్వరం, చలి వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించాయని తల్లిదండ్రులు ఆరోపించారు. సాధారణ చికిత్స కోసం తీసుకువచ్చిన పిల్లలు అకస్మాత్తుగా పరిస్థితి విషమించడంతో కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఐసీయూకు తరలించిన చిన్నారులు…
పరిస్థితి క్షణక్షణం దిగజారుతుండడంతో వైద్య సిబ్బంది వెంటనే 15 మంది చిన్నారులను ఐసీయూకు తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించినప్పటికీ, తల్లిదండ్రుల్లో ఆందోళన మాత్రం తగ్గలేదు.
ఈ ఘటనపై చిన్నారుల కుటుంబసభ్యులు, స్థానికులు ఘాటుగా స్పందించారు. ఇంజెక్షన్ ఇవ్వడంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారులకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని వారు ఆరోపించారు. ఆస్పత్రిపై కఠినచర్యలు తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సంఘటన బయటపడిన వెంటనే ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నించి ప్రాథమిక స్థాయిలో విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇంజెక్షన్‌లో సమస్య ఉందా? లేక ఇవ్వడంలో ఏదైనా పొరపాటు జరిగిందా? అన్న అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.



