మదనపల్లె కిడ్నీ రాకెట్‌ హడావిడి: గ్లోబల్‌ ఆస్పత్రి పై సంచలన ఆరోపణలు

కిడ్నీ రాకెట్‌ దారుణంలో ప్రాణాలు కోల్పోయిన యమున శవపరీక్ష నివేదికలో కీలక అంశం వెలుగుచూసింది. వైద్యులు స్పష్టంగా పేర్కొన్నదేమంటే—యమునకు ఎడమ వైపు కిడ్నీ లేదని. ఈ విషయంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. కిడ్నీ ఎక్కడికి పోయింది? ఎవరి వద్దికి చేరింది? అనే ప్రశ్నలకు ఇప్పటివరకు వ్యక్తమైన స్పష్టత లేదు.

దర్యాప్తు అధికారుల సమాచారం ప్రకారం, బెంగళూరుకు చెందిన ఓ యురాలజీ డాక్టర్‌ మదనపల్లెలోని గ్లోబల్‌ హాస్పిటల్‌లో యమునపై శస్త్రచికిత్స చేసి కిడ్నీని తొలగించాడు. తొలగించిన ఆ కిడ్నీ గోవాకు చెందిన రంజన్‌ నాయక్‌ అనే వ్యక్తితో ఒప్పందం కుదిరిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ డాక్టర్‌ అప్పటి నుండి పరారీలో ఉండటంతో అసలు కిడ్నీకి ఏమైందన్న అంశం మిస్టరీగా మారింది.


అది విక్రయించారా?
బెంగళూరులోనే ఎవరికైనా మార్పిడి చేశారా?
లేదా గోవాకు పంపించారా?
అన్నదానిపై పోలీసులు స్పష్టమైన ఆధారాలు కనుగొనలేకపోతున్నారు.

ఈ రహస్యం చూరగొట్టేది పరారీలో ఉన్న ఆ డాక్టర్‌ను పట్టుకోవడమేనని పోలీసులు పేర్కొంటున్నారు. అతడి కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని మదనపల్లె డీఎస్‌పీ మహేంద్ర వెల్లడించారు. ఇదే కేసులో డాక్టర్‌ ఆంజనేయులు, టెక్నీషియన్లు బాలరంగడు, మెహరాజ్‌, పద్మ, సత్య, సూరిబాబు తదితరులను డీఎస్‌పీ కార్యాలయంలో విచారిస్తున్నారు.


ఆధారాలను చెరిపేసిన గ్లోబల్‌ ఆస్పత్రి యాజమాన్యం

గ్లోబల్‌ హాస్పిటల్‌ భవనం వెలుపల, లోపల, కారిడార్లలో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీలను ఆస్పత్రి యాజమాన్యం కావాలనే డిలీట్‌ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నా, అందులో డేటా పూర్తిగా తొలగించబడినట్లు బయటపడటంతో విచారణాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ప్రధాన ఆధారాలు కోల్పోయారు.


పోలీసుల దర్యాప్తుపై విమర్శలు

కిడ్నీ రాకెట్‌ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నా, కీలక బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డాక్టర్‌ ఆంజనేయులపైనే కేసులు నమోదు కాగా, అదే ఆస్పత్రిలో పనిచేసిన డాక్టర్‌ అవినాష్‌, డాక్టర్‌ శాశ్వతిలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు తీరుపై స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు, సామాజిక వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి