జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసినా, ఆ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. ఇప్పుడు అక్కడ రాజకీయ పార్టీల చర్యలు కొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు విచ్చలవిడిగా డబ్బు పంచిపెట్టగా, ఇప్పుడు అదే నాయకులు ఆ డబ్బును తిరిగి రాబట్టేందుకు రంగంలోకి దిగారు.
బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లలో స్థానిక నాయకులు తిరుగుతూ, “డబ్బు తీసుకుని ఓటు వేయని వారు ఎవరు?” అని అడుగుతున్నారు. కొంతమంది వద్దకు వెళ్లి నేరుగా “మీరు ఓటు వేయలేదు, కాబట్టి డబ్బు తిరిగి ఇవ్వాలి” అని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో జూబ్లీహిల్స్ పరిధిలోని ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ, అలాగే సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న బీఆర్ఎస్ — రెండూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ఈ రెండు ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేశాయి. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కథ మరో మలుపు తిరిగింది. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల ద్వారా ఓటు వేసిన వారి జాబితాను సేకరించి, డబ్బు ఇచ్చిన వారి జాబితాతో సరిపోల్చి, ఎవరు మోసం చేశారో గుర్తిస్తున్నారు.
తమ వద్ద నుంచి డబ్బు తీసుకుని ఓటు వేయని వారిని గుర్తించిన తర్వాత, బూత్ కమిటీ సభ్యులు వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఉదాహరణకు — ఎస్పీఆర్ హిల్స్‌లోని ఓ కుటుంబం 18 ఓట్లకు గాను రూ.45 వేల రూపాయలు తీసుకుంది. కానీ వారిలో నలుగురే ఓటు వేసారని గుర్తించిన స్థానిక నాయకులు, మిగిలిన 14 మంది ఇచ్చిన డబ్బు వెంటనే తిరిగి ఇవ్వాలని ఆ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులు ఎర్రగడ్డ, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ వంటి ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల బస్తీ పెద్దలు సైతం జోక్యం చేసుకుంటూ, “వాళ్లు తిరిగి ఇవ్వకపోతే మీరు వసూలు చేసి బస్తీ అవసరాలకు వాడుకోండి” అని పార్టీ నాయకులు సూచిస్తున్నట్లు సమాచారం.
అపార్ట్మెంట్లలో అయితే పరిస్థితి మరింత విచిత్రంగా మారింది. మధురానగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో పార్టీ నాయకులు ఓటు వేయని వారి జాబితాను అందజేయడంతో, అక్కడి నివాసితులు సమావేశమై విచారణ జరిపారు. చివరికి, “డబ్బు తీసుకుని ఓటు వేయని వారు ఆ మొత్తం తిరిగి ఇస్తే, ఆ డబ్బును అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులకు ఉపయోగిద్దాం” అని నిర్ణయం తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా, ఆ పార్టీ బూత్ కమిటీ సభ్యులు కూడా ఈ నిర్ణయానికి సమ్మతించారు.
మొత్తానికి, ఓటుకు నోటు వ్యవహారం జూబ్లీహిల్స్‌లో కొత్త రగడను రేపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బు, ఇప్పుడు ఓటర్లకే తలనొప్పిగా మారింది.



