భార్యతో పారిపోయిన వ్యక్తికి గుణపాఠం నేర్పిన భర్త – సోషల్ మీడియాలో వైరల్!

ఈ సమాజం ఎటు దిశగా సాగుతుందో అనిపించే సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను హత్య చేసే ఘటనలు ఒకవైపు కొనసాగుతుండగా, మరొకవైపు అక్రమ సంబంధాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, బీహార్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వింత ఘటన మాత్రం ఈ అన్నింటికంటే విచిత్రంగా మారింది. తన భార్య వేరే వ్యక్తితో పారిపోగా, ఆ వ్యక్తి భార్యను పెళ్లి చేసుకున్న భర్త – వినడానికి సినిమా కథలా ఉన్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగిందంటే…

బీహార్ రాష్ట్రంలోని ఖగారియా జిల్లాకు చెందిన నీరజ్ కుమార్ అనే వ్యక్తి, 2009లో రూబీ దేవి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. మొదట్లో అన్నీ బాగానే సాగుతున్నాయి. కానీ కాలక్రమేణా రూబీ దేవి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె అదే ప్రాంతానికి చెందిన ముఖేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం తెలిసిన నీరజ్ భార్యను హెచ్చరించాడు, కానీ ఆమె మారలేదు. తరచూ గొడవలు జరుగుతుండడంతో చివరికి 2022 ఫిబ్రవరిలో రూబీ దేవి తన భర్తను, పిల్లలను వదిలి ముఖేష్‌తో కలిసి పారిపోయింది.

తన భార్య కనిపించకపోవడంతో షాక్‌కు గురైన నీరజ్, ఖగారియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మొదట్లో ఇది కిడ్నాప్ కేసుగా పరిగణించినా, పోలీసులు విచారణ జరిపిన తర్వాత రూబీ దేవి మరియు ముఖేష్ ఇద్దరూ స్వచ్ఛందంగా వేరే ప్రాంతానికి వెళ్లి సహజీవనం ప్రారంభించినట్లు తెలిసింది.

ఆశ్చర్యకర మలుపు

తన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిస్తున్న నీరజ్‌కు అప్పుడే ఒక షాకింగ్ సమాచారం తెలిసింది. తన భార్యతో పారిపోయిన ముఖేష్‌కూ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆమె పేరు కూడా రూబీగానే ఉండటం విశేషమని తెలిసింది.

అప్పుడు నీరజ్, ముఖేష్ భార్యను కలిసి వారికి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. “మన ఇద్దరికీ బాధ ఒకటే… మన జీవిత భాగస్వాములు వేరే వ్యక్తులతో పారిపోయారు. మనం పరస్పరం పెళ్లి చేసుకుంటే మన గాయానికి గాయం తో గాయం నయం అవుతుంది” అని చెప్పాడు. ఆ ఆలోచనకు ఆమె అంగీకరించడంతో, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఇలా, తన భార్యతో పారిపోయిన వ్యక్తి భార్యను వివాహం చేసుకున్న నీరజ్, జీవితాన్ని కొత్తగా ప్రారంభించాడు.

వైరల్ అయిన రివేంజ్ లవ్ స్టోరీ

ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ, ఇటీవల ఒక స్థానిక న్యూస్ బ్లాగ్ ఈ కథను వీడియో రూపంలో ప్రచురించడంతో అది సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయింది. నెటిజన్లు దీన్ని “రివేంజ్ లవ్ స్టోరీ”గా పేర్కొంటూ విస్తృతంగా పంచుకుంటున్నారు.

కొంతమంది “భార్యకు భార్య చెల్లు” అంటూ వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు “ఇదో కొత్త రకం ప్రేమ ప్రతీకారం” అంటూ స్పందిస్తున్నారు.

మొత్తానికి, ఈ ఘటన మనిషి భావోద్వేగాల అంచులను, ప్రతీకారానికి దారి తీసే జీవిత మలుపులను బహిర్గతం చేస్తోంది — సమాజం ఎటు దిశగా సాగుతుందో ప్రశ్నించేలా చేసింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి