ఆధునికతకు దూరంగా.. సహజ జీవనమే లక్ష్యంగా సాగుతున్న శ్రీకాకుళం జిల్లా కూర్మా గ్రామం

భారతదేశ అభివృద్ధికి గ్రామాలే పునాది అని మేధావులు పలుమార్లు పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు సాగుతుందని అందరూ నొక్కి చెబుతుంటారు. నేటి కాలంలో చాలామంది గ్రామాలు నగరీకరణ దిశగా అడుగులు వేస్తూ, ఇంటర్నెట్‌, కరెంటు, స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్‌ లావాదేవీలతో ఆధునిక జీవితాన్ని అనుసరిస్తున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామం మాత్రం ఈ ధోరణికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆధునికతను పక్కన పెట్టి, సహజ జీవన పద్ధతులను కాపాడుకుంటూ కొనసాగుతున్న ఆ గ్రామం పేరు కూర్మా గ్రామం.

ఈ గ్రామం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచానికి దూరంగా, సాంకేతిక పరిజ్ఞానానికి వ్యతిరేకంగా కూర్మా గ్రామం ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతోంది. ఇక్కడ ప్రజలు విద్యుత్‌ వినియోగించరు, మొబైల్‌ ఫోన్లు వాడరు, డిజిటల్‌ ట్రాన్సాక్షన్లు చేయరు. సహజసిద్ధమైన పద్ధతుల్లోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

విద్యుత్‌ లేకుండానే వెలుగులు

కూర్మా గ్రామంలో కరెంటు లేదు. సూర్యాస్తమయం అనంతరం చీకటిలో దీపం వెలిగించి హారతి ఇచ్చి విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పూజలు చేసి పనులు మొదలుపెడతారు. రాత్రివేళల్లో కరెంటు వినియోగం వల్ల మనసు చంచలమవుతుందని, మనుషులలో రాక్షస భావాలు, నెగటివ్‌ ఆలోచనలు పెరుగుతున్నాయని భావించి విద్యుత్‌ను పూర్తిగా దూరం పెట్టారని చెబుతున్నారు.

మొబైల్‌ ఫోన్లకు నో

ఇక్కడి ప్రజలకు మొబైల్‌ ఫోన్లు లేవు. మొబైల్‌ వాడకంతో మానసిక ఆందోళనలు, మానవ సంబంధాల్లో విరుపులు వస్తాయని నమ్మకం. ముఖ్యంగా పిల్లలు మొబైల్‌లతో మునిగిపోతున్నారని, దాని ప్రభావం వారి భవిష్యత్తుపై పడుతోందని భావించి, మొబైల్‌లను పూర్తిగా నిషేధించారు.

వస్తు మార్పిడి వ్యవస్థ

ఈ గ్రామ ప్రజలు మార్కెట్‌కు వెళ్లడం లేదు. తమ అవసరాలకు కావాల్సిన కూరగాయలు, ధాన్యాలు స్వయంగా పండించుకుంటారు. ఒకరికొకరు వస్తువులను మార్పిడి చేసుకుంటూ సహజ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. డబ్బు వ్యవహారాల కన్నా పరస్పర సహకారమే ఇక్కడ ప్రాముఖ్యత పొందింది.

సాంప్రదాయ బోధనలు

ప్రతి ఉదయం గ్రామస్తులు శ్రీకృష్ణుడికి హారతి ఇచ్చి తమ దినచర్య మొదలుపెడతారు. చిన్నపిల్లలకు ఆధ్యాత్మికత, సాంప్రదాయ విలువల బోధనలు అందిస్తారు. ఆధునికతకు దూరంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని వారు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన వాతావరణం

పచ్చని కొండలు, స్వచ్ఛమైన గాలి మధ్య ఉన్న ఈ గ్రామం సహజసిద్ధ సౌందర్యంతో కళకళలాడుతోంది. ఇక్కడ జీవనం సహజ పద్ధతుల్లో సాగుతుండడంతో ప్రజలు చాలా కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నారని చెబుతున్నారు. ఆధునిక ప్రపంచం కలుషిత జీవనంతో నిండిపోతున్న తరుణంలో, ఇక్కడి సహజ జీవన విధానం అందరికీ ఆదర్శమని భావిస్తున్నారు.

పర్యాటకుల ఆకర్షణ

కూర్మా గ్రామాన్ని చూసేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. కొందరు కొద్దిరోజులు గడిపి తిరిగి వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఇష్టపడి శాశ్వతంగా స్థిరపడి పోతున్నారు.

ఆధునికతతో కలుషితమైన ప్రపంచంలో సహజ జీవన పద్ధతులను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న కూర్మా గ్రామం నేటి సమాజానికి ఒక మార్గదర్శక ఉదాహరణగా నిలుస్తోంది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి