దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పేలుళ్ల శబ్దం సంచలనం రేపింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో నిలిపి ఉంచిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత వరుసగా మరికొన్ని వాహనాల్లో కూడా మంటలు వ్యాపించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ప్రారంభ సమాచారం ప్రకారం ఒకరు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక దళం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తుగా జరిగిందా..? లేక దాని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా..? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఐదు కార్లు అగ్నికి ఆహుతి – 9 మంది మృతి
సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని పార్కింగ్ ఏరియాలో పేలుడు సంభవించింది. ఆ కార్ బ్లాస్ట్ తీవ్రతకు పక్కన నిలిపి ఉంచిన ఐదు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు చుట్టుపక్కల భవనాల వరకూ వ్యాపించాయి. ఈ దారుణంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత పోలీసులు ఘటనా స్థలాన్ని పూర్తిగా మూసివేసి, ఆధారాల సేకరణ ప్రారంభించారు. ఫోరెన్సిక్ మరియు స్పెషల్ సెల్ బృందాలు పేలుడు స్వరూపాన్ని విశ్లేషిస్తున్నాయి.
ఇక ఈ ఘటనకు ముందు ఉదయం ఢిల్లీ పోలీసులు నగర శివార్లలో ఉగ్రవాద కుట్రను భగ్నం చేసి, ఏడుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం గమనార్హం. అదే రోజు సాయంత్రం ఈ పేలుడు జరగడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.
ప్రత్యక్ష సాక్షుల వర్ణన
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం పేలుడు శబ్దం చాలా భారీగా ఉండటంతో చుట్టుపక్కల భవనాల కిటికీలు కూడా విరిగిపోయాయి.
ఒక స్థానిక వ్యాపారి మాట్లాడుతూ – “నేను నా దుకాణంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పేలుడు శబ్దం వచ్చి నేలపై పడిపోయాను. ఇంత శక్తివంతమైన పేలుడు నేను ఎప్పుడూ వినలేదు,” అని తెలిపారు.
మరో ప్రత్యక్ష సాక్షి రాజ్‌ధర్ పాండే మాట్లాడుతూ – “నేను ఇంట్లో ఉన్నాను, ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. టెర్రస్‌పైకి వెళ్లి చూసే సరికి మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పరిస్థితి భయంకరంగా ఉంది,” అని వివరించారు.
ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు రోడ్డుపై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యం చూసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. “ఇలాంటి దృశ్యం మేము జీవితంలో ఎప్పుడూ చూడలేదు,” అని ఒకరు పేర్కొన్నారు.
ఢిల్లీలో హై అలర్ట్
ఈ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్య ప్రదేశాలు, మెట్రో స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్లు అన్నీ పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు భద్రతా బలగాలను మోహరించారు.
పేలుడు ప్రమాదవశాత్తుగా జరిగిందా, లేక ఇది ఒక ఉగ్రదాడి పూర్వ సంకేతమా అన్న దానిపై అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాల నివేదికపై ఆధారపడి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.



