మానవ శరీరం, ముఖ్యంగా మెదడు సక్రమంగా పనిచేయడానికి నిద్ర ఎంత కీలకమో వైద్యశాస్త్రం నిర్ధారించింది. కానీ ఈ సూత్రాన్ని పూర్తిగా తారుమారు చేస్తూ ఒక వ్యక్తి జీవిస్తున్నాడు. ఆయన పేరు థాయ్ న్గోక్, వయసు 81 సంవత్సరాలు, వియత్నాంకు చెందిన క్వాంగ్ నామ్ ప్రావిన్స్ నివాసి. ఆయన కథనం ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలను, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కారణం — ఆయన గత 62 ఏళ్లుగా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు!
జ్వరం తరువాత మారిన జీవితం
1962లో న్గోక్‌కి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం తగ్గిన తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. జ్వరం తగ్గినా, నిద్రపోయే సామర్థ్యం మాత్రం పూర్తిగా కోల్పోయారు. ఎంత ప్రయత్నించినా ఆయనకు నిద్ర పట్టలేదు. మందులు వాడారు, ఇంటి చిట్కాలు చేశారు, మద్యం సేవించారు — కానీ ఫలితం ఏదీ రాలేదు. చివరికి ఆయన నిద్రపోవడం మానేశారు.
ఈ విషయం గురించి ఆయన స్వయంగా చెబుతూ, తన కుటుంబ సభ్యులూ ధృవీకరించారు — “1962 నుండి ఇప్పటి వరకు మా తండ్రి ఒక్కసారి కూడా నిద్రపోలేదు” అని వారు తెలిపారు.
శాస్త్రవేత్తలకే చిక్కు
సాధారణంగా మనిషి కొద్ది రోజులకంటే ఎక్కువ నిద్ర లేకుండా ఉండలేడని వైద్య శాస్త్రం చెబుతుంది. నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, మెదడు పనితీరు దెబ్బతినడం జరుగుతుందని పరిశోధనలు చూపిస్తున్నాయి. కానీ థాయ్ న్గోక్ మాత్రం అందరికీ విరుద్ధంగా సర్వసాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
వైద్యులు పలుమార్లు ఆయనను పరీక్షించారు. ఆశ్చర్యంగా ఆయన రక్తపోటు, గుండె స్పందన, మెదడు క్రియాశీలత — అన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఇది వైద్య నిపుణులకు ఇప్పటికీ ఒక రహస్యమయ పజిల్ లా ఉంది.
న్గోక్ దినచర్య – ఒక చురుకైన రైతు జీవితం
న్గోక్ ప్రతిరోజూ తెల్లవారుజామునే లేస్తారు (లేదంటే నిద్ర లేవడం కాదు — ఆయన ఎప్పుడూ మేలుగానే ఉంటారు!). ఆయన రోజంతా తన పొలంలో పని చేస్తారు, బరువులు మోస్తారు, బియ్యపు వైన్ తయారు చేస్తారు. రాత్రుళ్లు గ్రామస్థులతో మాట్లాడుతూ సమయం గడుపుతారు.
2023లో ప్రముఖ అమెరికన్ ట్రావెల్ యూట్యూబర్ డ్రూ బిన్స్కీ, న్గోక్‌ను కలసి రాత్రంతా ఆయనతో గడిపాడు. ఆ సమయంలో కూడా న్గోక్ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తూనే ఉన్నారని బిన్స్కీ ఆశ్చర్యపడ్డాడు. ఆయన వీడియో ప్రకారం, న్గోక్ రోజుకు అర లీటర్ బియ్యపు వైన్, సుమారు 70 సిగరెట్లు తాగుతారు. అయినప్పటికీ ఆయన శరీరం చురుకుగా ఉండడం వైద్యులను విస్మయపరుస్తోంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్
న్గోక్ కథనం సోషల్ మీడియాలో విస్తృతంగా పాపులర్ అయింది. కొందరు ఆయన అసాధారణ శారీరక బలాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు వియత్నాం యుద్ధ కాలంలో ఆయన ఎదుర్కొన్న Post-Traumatic Stress Disorder (PTSD) వల్లే ఈ స్థితి ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఏదేమైనా, థాయ్ న్గోక్ జీవితం మానవ శరీరం సామర్థ్యాల గురించి కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. నిద్ర లేకుండా సర్వసాధారణంగా జీవించడం అసాధ్యమని భావించే ప్రపంచానికి, ఆయన కథ ఒక అద్భుత మానవ గాధగా నిలిచిపోయింది.



