పులిమేడు మార్గం – అడవుల మధ్య ఆధ్యాత్మిక యాత్ర, అయ్యప్ప భక్తులకు అద్భుత అనుభవం!

శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు సాధారణంగా మూడు ప్రధాన మార్గాల ద్వారా వెళ్తారు. వాటిలో “పులిమేడు మార్గం” అత్యంత కఠినమైనదిగా, అలాగే అత్యంత సాహసకరమైనదిగా పేరుగాంచింది. అడవుల మధ్యలో, ప్రకృతి ఒడిలో సాగే ఈ రూట్ భక్తులకు భక్తి, భయం, థ్రిల్ అన్నీ కలగలిపిన అనుభూతిని ఇస్తుంది. ట్రెక్కింగ్‌ ప్రియులు, సాహస యాత్రికులు ఈ మార్గాన్ని ఎంతో ఇష్టపడతారు. అయితే, ఈ దారిలో అడుగడుగునా ఆధ్యాత్మికతతో పాటు జాగ్రత్తలు కూడా అవసరం.

హరిహరసుతుడి యాత్ర ప్రారంభం
శబరిమల మండల కాలం, మకరవిళక్కు వేళలు రాబోతున్న నేపథ్యంలో భక్తులు యాత్రా సిద్ధతలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామిని దర్శించేందుకు పంపా మార్గం, ఎరుమేలి మార్గం, పులిమేడు మార్గం – ఈ మూడు రూట్లలో పులిమేడు పాతకాలపు సంప్రదాయ మార్గంగా, చారిత్రాత్మక ప్రాధాన్యంతో ప్రసిద్ధి పొందింది.

సాధారణంగా భక్తులు చిన్నపాదం రూట్‌లో పంపా బేస్‌ నుంచి నీలిమల, శరణ్‌గుత్తి మీదుగా శబరిమలకు చేరుతారు. పెద్దపాదం రూట్‌లో ఎరుమేలి నుంచి కరిమల కొండలు, అలుదా నది దాటి పంపాకు చేరుతారు. కానీ, వీటన్నింటికంటే కఠినమైనది పులిమేడు మార్గమే.

పులిమేడు మార్గం విశిష్టతలు
పులిమేడు మార్గం పెరియార్ టైగర్ రిజర్వ్ అరణ్య ప్రదేశం గుండా సాగుతుంది. ఈ మార్గం భక్తులను భద్రాక్ష చెట్ల మధ్యన, వన్యప్రాణుల పాదముద్రల మధ్యన తీసుకువెళ్తుంది. ప్రత్యేకంగా భక్తి, ధైర్యం కలిసిన ఆధ్యాత్మిక పరీక్షగా భావించబడే ఈ రూట్‌లో ప్రతి అడుగు భక్తుల నిశ్చయాన్ని పరీక్షిస్తుంది.

యాత్ర ప్రారంభం – వండి పెరియార్ నుంచి సత్రం దాకా
పులిమేడు రూట్‌ ఎక్కాలనుకునే భక్తులు ముందుగా ఇడుక్కి జిల్లాలోని వండి పెరియార్‌కి చేరుకోవాలి. ఒకప్పుడు, 2011 వరకూ, కేఎస్ఆర్టీసీ బస్సులు పులిమేడు కొండపైవరకు వెళ్లేవి. కానీ ఆ సంవత్సరం మకరజ్యోతి సందర్భంలో జరిగిన బస్సు ప్రమాదం తర్వాత అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ప్రస్తుతం కాలినడకన వెళ్ళేవారికి కూడా పులిమేడు ఫారెస్ట్ చెక్‌పోస్టు దగ్గర నుంచి పరిమిత అనుమతులు మాత్రమే ఇస్తారు. చెక్‌పోస్టు వద్ద నుంచి కుడివైపున ఉన్న కఠినమైన మార్గంలో ‘సత్రం’గా పిలిచే సుబ్రమణ్య స్వామి ఆలయం ఉంటుంది.

అడవి నియమాలు, జాగ్రత్తలు
ఉదయం 6 గంటల వరకు అడవిలోని వాటర్ పాయింట్ల వద్ద ఏనుగుల మందలు నీరు తాగడానికి వస్తాయి. అందువల్ల భక్తులను ఉదయం 7 గంటల తర్వాత మాత్రమే సత్రం ఆలయం వైపు అనుమతిస్తారు. అక్కడ పోలీసులు భక్తుల పేర్లను నమోదు చేసి మాత్రమే పులిమేడు దారిలోకి పంపుతారు.

సత్రం నుంచి పులిమేడు కొండ ఎక్కడం ప్రారంభమవుతుంది. దారిలో చిన్నచిన్న వాగులు, జలగలతో కూడిన చెరువులు ఉంటాయి. భక్తులు జాగ్రత్తగా నడవాలి. తాగునీరు దొరకడం కష్టం కాబట్టి, వాటర్ బాటిల్స్, తినుబండారాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

ప్రకృతి మధ్య ఆధ్యాత్మిక తపస్సు
పులిమేడు యాత్ర భక్తికి పరీక్ష, ప్రకృతికి నమస్కారం, ఆత్మీయతకు గుర్తు. ప్రతి అడుగు భయపెట్టినా, చివరికి అయ్యప్ప దర్శనం అన్నీ మరిచిపించే అనుభూతిని ఇస్తుంది. సాహసకరంగా, భక్తి మార్గంలో పులిమేడు పయనం భక్తుని అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది.

స్వామియే శరణం అయ్యప్పా!

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి