వేలకొద్దీ నాటుకోళ్లు రోడ్డుపై.. ప్రజల పరుగులు.. హన్మకొండలో విచిత్ర దృశ్యం! 

నాటుకోడి అంటే రుచి, సువాసనకు సాటి లేదని అందరికీ తెలిసిందే. ఎంత ఖరీదైనా నాటి కోళ్లు కొనుగోలు చేయడంలో చాలా మందికి వెనుకాడరు. అయితే ఇలాంటి నాటి కోళ్లు ఉచితంగా లభిస్తే? అదే నిజంగా జరిగిపోయింది. తాజాగా హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

శనివారం ఉదయం ఎల్కతుర్తి–సిద్ధిపేట జాతీయ రహదారి పక్కన వింత దృశ్యం కనిపించింది. రహదారి పక్కన ఉన్న పత్తి చేల మధ్య అకస్మాత్తుగా వేలకొద్దీ నాటుకోళ్లు పరుగులు పెడుతూ కనిపించాయి. ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉత్సాహంతో పరుగులు తీశారు. ఎవరికీ అర్థం కాకముందే అక్కడ ఓ రకంగా “కోడిపందెం” మొదలైంది.

చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ దృశ్యం చూసి అక్కడికి చేరుకున్నారు. కొందరు ఒక్కటి రెండు కోళ్లు పట్టుకుని సంతోషంగా వెళ్ళిపోతుండగా, మరికొందరు సంచులు, బుట్టలతో వచ్చి పదుల కొద్దీ కోళ్లు సేకరించారు. పిల్లలు, పెద్దలు అందరూ కలసి కోళ్లు పట్టుకునే ఈ ఆటలో పాల్గొనడంతో ఆ ప్రదేశం మొత్తం కోళ్ల అరుపులతో, ప్రజల కేరింతలతో కిక్కిరిసి పోయింది.

ఇంతలో కొందరు గ్రామస్తులు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కోళ్లకు ఏదైనా వ్యాధి సోకిందా? లేక ఫామ్ యజమానులు ఇన్ఫెక్షన్ కారణంగా వదిలేశారా? అని అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని కొన్ని కోళ్ల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు.

స్థానికుల అంచనా ప్రకారం సుమారు రెండు వేలకుపైగా కోళ్లు ఒకేసారి వదిలేయబడినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు, ఎందుకు వదిలారన్నది ఇంకా తెలియరాలేదు. కొందరు ట్రక్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కోళ్లు బయటపడిపోయాయేమోనని చెబుతుండగా, మరికొందరు ఉద్దేశపూర్వకంగానే వదిలేశారని అంటున్నారు.

ఏదేమైనా, ఈ సంఘటన హన్మకొండ పరిసర ప్రాంతాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజలు ఉచితంగా నాటుకోళ్లు పట్టుకున్న ఆనందంలో ఉండగా, అధికారులు మాత్రం వాటి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి