అమరావతి (మంగళగిరి):
భారత మహిళల క్రికెట్ జట్టులో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ నాయకత్వం, ప్లేయర్ల కృషి, అనుభవం వల్లే ఈ రోజు భారత మహిళల క్రికెట్ ప్రపంచస్థాయిలో గౌరవనీయ స్థానం పొందిందని టీమ్ ఇండియా క్రికెటర్ శ్రీచరణి తెలిపారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో వరల్డ్ కప్ విజేతగా నిలిచిన తెలుగమ్మాయి శ్రీచరణి శుక్రవారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంగళగిరి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు 2.5 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతి, గ్రూప్-1 ఉద్యోగం, కడపలో 1000 చ.గజాల స్థలం కేటాయించడం చాలా పెద్ద గౌరవం. అలాగే మహిళా క్రికెట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు.
తన క్రికెట్ కెరీర్‌లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించిందని శ్రీచరణి చెప్పారు. “ఏసీఏ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయికి రాలేకపోయేదాన్ని. ఏసీఏ ఇచ్చిన అవకాశాలతోనే నేను నా ప్రతిభను నిరూపించుకున్నాను” అని ఆమె తెలిపారు.
తన క్రికెట్ ప్రయాణం గల్లీ క్రికెట్‌తో మొదలైందని, తాను క్రికెట్ ఆడటానికి మావయ్య ప్రేరణగా మారారని ఆమె చెప్పారు. “మా నాన్న మొదట్లో అథ్లెటిక్స్‌నే కొనసాగించమని చెప్పారు. తర్వాత నెమ్మదిగా క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నారు. మా కుటుంబం సపోర్ట్ చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగాను” అని శ్రీచరణి వివరించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రేరణ నింపిందని ఆమె అన్నారు. “మోదీ గారు జీవితంలో ఇక్కడితో ఆగిపోకండి, ఇంకా ఎన్నో సాధించాలి అని చెప్పిన మాటలు మమ్మల్ని ఉత్సాహపరిచాయి. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్పూర్తినిచ్చారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కష్టపడతాను” అని శ్రీచరణి తెలిపారు.
వరల్డ్ కప్ సందర్భంగా ఎదురైన కఠిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ, “మేము వరుసగా కొన్ని మ్యాచులు ఓడిపోయాం. కానీ ఆ తర్వాత మళ్లీ దృఢనిశ్చయంతో ముందుకు సాగి, చివరికి విజేతలమయ్యాం. ఆ క్షణం మా జీవితంలో మర్చిపోలేనిది” అని ఆమె చెప్పారు.
డబ్ల్యూపీఎల్ (WPL) వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.55 లక్షలకు తనను ఎంపిక చేయడం తన జీవితంలో మలుపు తీసుకువచ్చిందని తెలిపారు. “ఈ అవకాశాన్ని వదిలిపెట్టకుండా, నా ప్రతిభను నిరూపించుకోవాలనే లక్ష్యంతో కృషి చేశాను” అని ఆమె చెప్పారు.
మహిళా క్రికెట్ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, “ఇప్పుడు తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రికెట్ ఆడొద్దు అనడం లేదు. చాలా మంది నన్ను సంప్రదించి తమ పిల్లలు క్రికెట్‌లో కెరీర్ ఎలా ప్రారంభించాలా అని అడుగుతున్నారు. ఇది సానుకూల మార్పు” అని శ్రీచరణి వివరించారు.
ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్నీ) మాట్లాడుతూ, “శ్రీచరణి విజయంతో రాష్ట్రంలోని యువ మహిళా క్రికెటర్లకు కొత్త స్పూర్తి వచ్చింది. త్వరలోనే మహిళా క్రికెట్ అకాడమీని ఏసీఏ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్నాం. ఆమెను ఘనంగా సన్మానించి, ప్రోత్సాహక బహుమతి అందజేస్తాం” అని ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా శ్రీచరణిని కలుసుకుని, ఆమె కుటుంబం, క్రికెట్ ప్రయాణం గురించి ఆరా తీశారని తెలిపారు. “మహిళల జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ గెలవడం, అందులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రీచరణి భాగమవడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణం” అని సీఎం అన్నారు.
ఏసీఏ తరఫున శ్రీచరణికి ప్రకటించిన బహుమతులపై అధ్యక్షుడు కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. “ఆమె భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మేము చూడగలుగుతాం. ఆమె మాత్రం కెరీర్‌పై దృష్టి పెట్టాలి” అని అన్నారు.
మిథాలీ రాజ్ కృషిని ప్రస్తావిస్తూ, “ఆమె నాయకత్వంలో టీమ్ రెండు సార్లు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది. ఇప్పుడు ఏసీఏలో కోచ్‌గా మిథాలీ ఉండటం ఆంధ్ర క్రికెట్‌కు గర్వకారణం. ఆమె పేరుతో వైజాగ్‌లో ఒక స్టాండ్ ప్రారంభించాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ బి.విజయ్‌కుమార్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు అస్కార్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



