యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ తీరప్రాంతంలో భయాందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. అత్యంత విషపూరితమైన సముద్ర జీవులు “పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్” (Portuguese Man O’ War) భారీ సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఈ జీవులను “తేలియాడే భయంకర జీవులు” (Floating Terrors) అని కూడా పిలుస్తారు. అబెరావాన్ బీచ్, పెంబ్రోక్‌షైర్, గ్వినెడ్, ఆంగ్లెసీ వంటి ప్రాంతాల్లో ఇవి కనబడడంతో పోర్ట్ టాల్బోట్ కోస్ట్‌గార్డ్ అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు వీటిని అసలు తాకకూడదని, బీచ్ వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జెల్లీఫిష్‌లా కనిపించినా… అత్యంత విషపూరితం
చూడటానికి జెల్లీఫిష్‌లా కనిపించినా, పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్ విషతత్వం మరింత ప్రమాదకరం. దీని టెంటకిల్స్ (స్పర్శకాలు) చర్మానికి తగిలితే తీవ్రమైన నొప్పి, దద్దుర్లు, బొబ్బలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో జ్వరం, శ్వాసలో ఇబ్బందులు, షాక్ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. అరుదైన సందర్భాల్లో ఇది ప్రాణాంతకమైన అలర్జీ రియాక్షన్లకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా, ఈ జీవి చనిపోయిన తర్వాత కూడా దాని స్పర్శకాలు విషతత్వాన్ని కోల్పోవు — అందువల్ల బీచ్‌పై చనిపోయినవి కనిపించినా వాటిని అస్సలు ముట్టుకోవద్దని అధికారుల హెచ్చరిక.
ఇది నిజానికి జెల్లీఫిష్ కాదు
వైల్డ్‌లైఫ్ ట్రస్ట్స్ నివేదిక ప్రకారం, పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్ అసలు జెల్లీఫిష్ కాదు. ఇది సైఫనోఫోర్ (Siphonophore) అనే ప్రత్యేకమైన సముద్ర జీవుల వర్గానికి చెందినది. అనేక సూక్ష్మజీవులు కలసి ఒక సమూహంగా జీవించే జీవరూపమిది. దీని శరీరం పారదర్శకమైన ఊదారంగు బుడగలాగా ఉంటుంది, పైభాగంలో గులాబీ రంగు శిఖరం, కిందకు వేలాడే నీలిరంగు టెంటకిల్స్ ఉంటాయి. సాధారణంగా ఇవి సముద్ర ఉపరితలంపై తేలుతూ ప్రయాణిస్తాయి, కానీ బలమైన గాలులు లేదా తుపానుల సమయంలో ఒడ్డుకు కొట్టుకువస్తాయి.
నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, వీటి విషం చిన్న చేపలను పక్షవాతానికి గురి చేసి చంపగలదు. మనుషుల చర్మానికి తగిలితే తీవ్రమైన మంట, దురద, భరించలేని నొప్పి కలిగిస్తుంది.
సముద్రతీరంలో జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రమాదవశాత్తు ఎవరికైనా ఈ జీవి తగిలితే వెంటనే సముద్రపు నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. చర్మానికి అంటుకున్న టెంటకిల్స్‌ను చేతితో కాకుండా ప్లాస్టిక్ కార్డ్ లేదా కఠిన వస్తువుతో నెమ్మదిగా తొలగించాలి. ఆ తర్వాత ఆ భాగాన్ని వేడి నీటిలో ముంచి, వెంటనే వైద్యుడి సహాయం తీసుకోవాలి.
ప్రస్తుతం కోస్ట్‌గార్డ్ సిబ్బంది బీచ్‌లపై ఈ ప్రమాదకర జీవులను తొలగించే చర్యలు చేపట్టారు. ప్రజలు హెచ్చరికలను కచ్చితంగా పాటించాలని, బీచ్‌లో తిరుగుతున్నప్పుడు పిల్లలను మరింత జాగ్రత్తగా కాపాడాలని అధికారులు సూచిస్తున్నారు.



