ఏపీలో మోంతా తుఫాన్ తీరం దాటి వెనుదిరిగింది. ఈ విపత్తును ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, రెస్క్యూ టీమ్‌ల తక్షణ స్పందన, శాఖల సమన్వయం ప్రజలకు రక్షణ కవచంలా నిలిచాయి.
సీఎం చంద్రబాబు 12 గంటలపాటు నిరంతర పర్యవేక్షణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు RTGS నుంచి తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి క్షేత్ర స్థాయిలో అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఒకేసారి 25 వేల మందికి పైగా అధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
12 గంటలపాటు నిరంతర సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, మరియు ఫీల్డ్ రిపోర్ట్‌లతో తుపాన్ పరిస్థితిని పర్యవేక్షించారు. విరిగిపడిన చెట్ల తొలగింపులో పాల్గొంటున్న సిబ్బందిని రియల్ టైమ్‌లో అభినందించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన సూచనలు
ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. లంక గ్రామాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించాలని, కాల్వలు, చెరువులకు గండిపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేయాలని, ప్రజలకు వాస్తవ సమాచారం అందించాలన్నారు. ముఖ్యంగా విజయవాడ, ఏలూరు, భీమవరం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం – మత్స్యకార కుటుంబాలకు ఐదు వేల ఆర్థిక సాయం
తుఫాన్ తర్వాత నష్టనివారణ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పడిపోయిన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ, రహదారుల క్లియరెన్స్‌పై ఫోకస్ చేసింది. ఐదు రోజులుగా సముద్రంలోకి వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ₹5,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, అలాగే ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదిక వెల్లడించింది.
విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
తుఫాన్ ప్రభావం దృష్ట్యా బుధవారం రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అదనంగా ఇంటర్మీడియట్ బోర్డు అక్టోబర్ 27 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది.
రాత్రంతా సచివాలయంలోనే మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలోనే ఉండి తుఫాన్ పరిస్థితిని పర్యవేక్షించారు. సీఎం ఆదేశాల మేరకు బాధిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుఫాన్ తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ సహా పలువురు నేతలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.



