తెలంగాణలో ఒక కుటుంబం ప్రత్యేకంగా చేసిన నిశ్చితార్థ వేడుక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నిశ్చితార్థం లేదా పెళ్లి వంటి వేడుకలకు బంధువులను, స్నేహితులను తీసుకెళ్లేందుకు బస్సులు లేదా కార్లు బుక్ చేయడం మనం తరచూ చూస్తుంటాం. అయితే, ఈసారి ఒక తండ్రి తన కుమారుడి నిశ్చితార్థానికి తన గ్రామస్థులు, బంధువులు, స్నేహితులందరికీ విమాన ప్రయాణ అనుభవం కల్పించాలనే ఆలోచనతో రెండు విమానాలనే బుక్ చేశారు.
వివరాల్లోకి వెళితే — నాగర్‌కర్నూల్ జిల్లా మేకల కుటుంబానికి చెందిన అయ్యప్ప కుమారుడు మేకల జగపతి (జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య సోదరుడు) గోవాలో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఈ వేడుకను జీవితాంతం గుర్తుండేలా చేయాలనే ఉద్దేశంతో తండ్రి మేకల అయ్యప్ప తన గ్రామంలోని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు అందరూ విమానంలో ప్రయాణించాలనే నిర్ణయం తీసుకున్నారు.
తండ్రి కోరిక మేరకు జగపతి స్వయంగా ఏర్పాట్లు చేసుకొని, సుమారు 500 మంది గ్రామస్తులు, రైతు కుటుంబాలు మరియు బంధువులను హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం నుండి రెండు ప్రత్యేక విమానాల్లో గోవాకు తరలించారు.
శనివారం ఉదయం రెండు విమానాల మొత్తం ప్రయాణికులందరూ ఒకే గ్రామానికి చెందినవారే కావడంతో విమానాశ్రయం సిబ్బంది, ఇతర ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సందర్భంలో మాజీ మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ, “మా తండ్రి అయ్యప్పగారి కోరిక ప్రకారం గ్రామంలోని ప్రతి ఒక్కరికీ విమాన ప్రయాణం అనుభవం కల్పించాలనే తలంపుతో ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అందరూ ఆనందంగా గోవా వెళ్లడం మాకు ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.
మేకల కుటుంబం నిశ్చితార్థం కేవలం ఒక కుటుంబ వేడుక కాకుండా, గ్రామం మొత్తం పండగగా మారి అందరికీ చిరస్మరణీయ అనుభవం ఇచ్చింది.



