ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన భారత యువకుడు అక్కడ మోసపోయి, ఎడారి మధ్య చిక్కుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ యువకుడు వీడియోలో కన్నీటి గాధను చెప్పి, “ప్లీజ్ హెల్ప్ మీ.. ఐ విల్ డై” అంటూ భారత ప్రభుత్వాన్ని కాపాడమని వేడుకుంటున్నాడు. ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ జిల్లా హందియా ప్రాంతానికి చెందిన ఆ యువకుడు ఉపాధి ఆశతో సౌదీ అరేబియా వెళ్లాడు. అయితే అక్కడ ‘కపిల్’ అనే వ్యక్తి అతన్ని మోసం చేసి, ఎడారి ప్రాంతంలో ఒంటెతో వదిలేశాడని యువకుడు వీడియోలో తెలిపాడు. “నా పాస్‌పోర్టు కపిల్ దగ్గర ఉంది. నేను ఇంటికి వెళ్తానంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నేను నా తల్లి దగ్గరకు వెళ్లాలి. దయచేసి నన్ను రక్షించండి,” అంటూ భోజ్‌పురి భాషలో తన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం వెంటనే స్పందించింది. రియాద్‌లోని భారత ఎంబసీ అధికారులు వీడియోను పరిశీలించి, ఆ యువకుడి వివరాలు సేకరించేందుకు చర్యలు ప్రారంభించారు. అయితే వీడియోలో అతడు తన ఖచ్చితమైన ప్రదేశాన్ని వివరించకపోవడంతో గుర్తింపు ప్రక్రియ కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరియు ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ యువకుడిని వెంటనే రక్షించాలని కోరుతున్నారు. సౌదీ అరేబియాలో ఇటీవలే “కఫాలా వ్యవస్థ” (ప్రవాస కార్మికుల యజమానుల ఆధీనంలో ఉంచే పాత వ్యవస్థ) రద్దు చేసిన నేపథ్యంలో, ఈ ఘటన మళ్లీ ఆ దేశంలోని కార్మికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ప్రస్తుతం ఈ సంఘటనపై సౌదీ దౌత్య అధికారులు మరియు భారత ఎంబసీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. యువకుడి ప్రాణ భద్రత కోసం భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని అంచనా.



