హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. మెగాస్టార్ అనుమతి లేకుండా ఆయన ఫోటోలు, బిరుదులు, వాయిస్, చిత్రం, ఇమేజ్, లేదా ఏఐ సాంకేతికతతో రూపొందించిన రూపాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని కోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఈ మేరకు జడ్జి ఎస్. శశిధర్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు (ఇంటెరిమ్ ఇంజంక్షన్)ను జారీ చేశారు.
చిరంజీవి వ్యక్తిత్వ హక్కులు, ప్రతిష్ఠ, ఇమేజ్ రక్షణ కోసం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారాలు, మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలు సహా ఎవరూ చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్ లేదా బిరుదులను వాడరాదని ఆదేశాలు జారీ చేసింది.
చిరంజీవి తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం— అనేక కంపెనీలు, సామాజిక మాధ్యమ ఖాతాలు ఆయన అనుమతి లేకుండా ఫొటోలు, పోస్టర్లు, లేదా ఏఐ ఆధారిత రూపాలను ఉపయోగించి వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నాయని తెలిపారు. ఈ చర్యల వల్ల మెగాస్టార్ ప్రతిష్ఠ దెబ్బతింటుందని న్యాయవాది వాదించారు.
కోర్టు పరిశీలన అనంతరం, చిరంజీవి వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. “మెగాస్టార్, బాస్, అన్నయ్య, చిరు” వంటి ఆయనకు సంబంధించిన బిరుదులు, పేర్లు కూడా ఈ ఉత్తర్వులకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
ఈ ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకు ఎవరూ ఆయన రూపం లేదా వాయిస్‌ను అనధికారికంగా ఉపయోగించరాదు. కోర్టు స్పష్టంగా తెలిపినట్టుగా, ఈ ఉత్తర్వులు మీడియా సంస్థలు మరియు ఆన్లైన్ ప్లాట్ఫారమ్లందరికీ బంధనీయమైనవి.
తదుపరి విచారణను సిటీ సివిల్ కోర్టు అక్టోబర్ 27కి వాయిదా వేసింది.



