మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సమాజంలో రక్షకులుగా నిలవాల్సిన కొందరు వ్యక్తులు ఇప్పుడు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన ఓ దారుణ ఘటన ఈ విషయాన్ని మరొకసారి నిరూపించింది. చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీస్ అధికారి, వైద్య సేవలను అందించే ఓ మహిళా డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.
సతరా జిల్లాలోని ఫాల్తాన్ ఉపవిభాగంలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా వైద్యురాలిపై స్థానిక ఎస్సై గోపాల్ బడ్నే పాశవికంగా ప్రవర్తించాడు. గత అయిదు నెలల కాలంలో ఏకంగా నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఆ అధికారి మాత్రమే కాకుండా, అతడి తోటి ఇద్దరు పోలీస్ అధికారుల నుంచీ కూడా ఆ మహిళా వైద్యురాలికి వేధింపులు ఎదురయ్యాయని వివరాలు చెబుతున్నాయి.
ఈ మానసిక, శారీరక బాధలను తట్టుకోలేక చివరికి ఆ వైద్యురాలు తన ప్రాణాలను తీసుకోవాలని నిర్ణయించుకుంది. మరణానికి ముందు తన అరచేతిపైనే “పోలీస్ అధికారి గోపాల్ బడ్నే నా చావుకి కారణం. గత అయిదు నెలలుగా నన్ను మానసికంగా, శారీరకంగా వేధించాడు” అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘోర సంఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనపై సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై గోపాల్ బడ్నేను తక్షణం సస్పెండ్ చేయగా, పూర్తి స్థాయి విచారణను ప్రారంభించినట్లు సతారా జిల్లా పోలీస్ అధికారులు వెల్లడించారు.
వైద్యురాలు మరణానికి ముందు డీఎస్పీ కార్యాలయానికి లేఖ పంపి తనపై వేధింపుల గురించి ముందుగానే ఫిర్యాదు చేసినట్లు కూడా వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో గోపాల్ బడ్నే, పాటిల్, లాడ్ పుత్రే పేర్లను స్పష్టంగా పేర్కొంది. అయితే, ఆ సమయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్యురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించగా, ఈ ఘటన రాజకీయ రంగానికీ చేరింది. పలు రాజకీయ పార్టీలు ఒకరినొకరు నిందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ఈ కేసుపై వేగంగా దర్యాప్తు జరుగుతోంది. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టం. ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశాం,” అని వెల్లడించారు.
మహిళల రక్షణ బాధ్యత వహించాల్సిన పోలీస్ శాఖలో ఇలాంటి ఘోర ఘటన చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. ఈ కేసులో నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు.



