మావోయిస్టుల నిర్మూలనపై కేంద్రం వ్యూహం, అక్టోబర్ 24న దేశ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై ఆ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తరఫున అభయ్ అనే పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.

ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం — కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు “ఆపరేషన్ కగార్” పేరిట యుద్ధాన్ని సాగిస్తున్నాయని, మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ హత్యలకు నిరసనగా అక్టోబర్ 23 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు, అక్టోబర్ 24న దేశ బంద్‌ను నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. అలాగే “ఆపరేషన్ కగార్” నిలిపివేయాలని, దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ఇదే సమయంలో, కేంద్ర ప్రభుత్వం మాత్రం మావోయిస్టులపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. 2026 మార్చి నెలాఖరు నాటికి దేశాన్ని పూర్తిగా మావోయిస్టు రహితంగా మార్చుతామని ప్రకటించింది. ఈ లక్ష్యంతో “ఆపరేషన్ కగార్” పేరిట పెద్ద ఎత్తున ఆపరేషన్‌లు చేపట్టి, వ్యూహాత్మకంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దళాలను కేంద్రీకరించింది. కేంద్రం పిలుపు మేరకు ఇప్పటికే వందలాది మావోయిస్టులు లొంగిపోయి ప్రధాన ప్రవాహంలో చేరారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ మినహా చాలా రాష్ట్రాలు మావోయిస్టు రహిత ప్రాంతాలుగా మారాయి.

అయితే, ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టుల ప్రభావం ఇంకా బలంగానే కొనసాగుతోంది. అక్కడ కేంద్ర, రాష్ట్ర బలగాలు నిరంతరాయంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ చర్యల్లో భాగంగా పలు ఎన్‌కౌంటర్లు జరిగి అనేక మంది మావోయిస్టు అగ్రనేతలు, సభ్యులు మృతి చెందారు. కొందరిని అరెస్టు చేయగా, మరికొందరు స్వచ్ఛందంగా లొంగిపోయారు.

ఇక తాజాగా మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్, దాదాపు వందమంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. అదే విధంగా మరో అగ్రనేత ఆశన్న కూడా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎదుట తన అనుచరులతో కలిసి లొంగిపోయారు. ఈ సందర్భంగా వారు పెద్ద మొత్తంలో ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు.

ఈ పరిణామాలపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్లోజుల వేణుగోపాల్‌, ఆశన్నల లొంగుబాటును విప్లవ ద్రోహంగా అభివర్ణించింది. పార్టీని వదిలి ప్రభుత్వానికి లొంగిపోవడం విప్లవ స్ఫూర్తికి విరుద్ధమని, ఇది ప్రజా ఉద్యమాన్ని బలహీనపరిచే చర్య అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి