పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ యువ క్రికెటర్ల మృతి – క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి

ఆఫ్ఘనిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్థాన్ చేసిన వైమానిక దాడి క్రీడా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ముగ్గురు యువ క్రికెటర్లు – కబీర్ అఘా, సిబ్ఘతుల్లా, హరూన్ – దుర్మరణం పాలవడం విశ్వవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరియు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం మీడియా ప్రకటనలో తెలిపారు – “ఈ కష్ట సమయంలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ), మృతుల కుటుంబాలకు మా సంఘీభావం. అమాయక యువ క్రీడాకారులను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత బాధాకరం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పెట్టుకోకూడదన్న మా నిర్ణయంపై బీసీసీఐ అచంచలంగా ఉంది” అని స్పష్టం చేశారు.

ఐసీసీ స్పందన – “క్రీడా ప్రపంచానికి తీరని నష్టం”

ఐసీసీ కూడా ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. స్నేహపూర్వక మ్యాచ్ ఆడిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్న ముగ్గురు ప్రతిభావంతుల జీవితాలు ఇలా ముగిసిపోవడం అత్యంత దారుణమని పేర్కొంది. వారి కుటుంబాలకు, ఆఫ్ఘన్ క్రికెట్ సమాజానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ వైదొలుగు

ఈ దాడికి నిరసనగా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి 29 వరకు పాకిస్థాన్‌లో జరగాల్సిన పాక్–శ్రీలంక–ఆఫ్ఘనిస్థాన్ ట్రై నేషన్ సిరీస్‌కు తమ జట్టు హాజరుకాకూడదని ప్రకటించింది. ఈ సిరీస్ లాహోర్, రావల్పిండి వేదికగా జరగాల్సి ఉంది.
ఏసీబీ సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రకటనలో, “పాకిస్థాన్ ప్రభుత్వం చేసిన ఈ దాడి క్రీడా విలువలను తుంచేసిన క్రూర చర్య. ఇది ఆఫ్ఘన్ క్రీడా రంగానికి తీరని నష్టం” అని తీవ్రంగా ఖండించింది.

జై షా ఆవేదన – “వారి కలలు అర్థాంతరంగా ముగిశాయి”

ఐసీసీ చైర్మన్ జై షా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా తన హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తూ పేర్కొన్నారు:

“ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు కబీర్ అఘా, సిబ్ఘతుల్లా, హరూన్‌లు ఒక క్రూరమైన హింసాత్మక దాడిలో ప్రాణాలు కోల్పోయారన్న విషయం నన్ను తీవ్రంగా కలిచివేసింది. దేశం కోసం ఆడాలనే తపనతో మైదానంలో అడుగుపెట్టిన ఆ యువకుల కలలు అర్థాంతరంగా ముగిసిపోవడం చాలా బాధాకరం.

ఇది కేవలం ఆఫ్ఘన్ క్రికెట్‌కే కాదు, యావత్ క్రీడా ప్రపంచానికీ తీరని నష్టం. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ ప్రతిభలను ఇంత దారుణంగా కోల్పోవడం మనందరినీ కలచివేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు, ఆఫ్ఘన్ క్రికెట్ సమాజానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాదం నుంచి వారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి