ప్రేమలో ఉన్న గోపి, లక్ష్మీ ప్రియాంక పెద్దల నిరాకరణతో తీవ్ర వేదనకు గురై విషాదాంతం పాలయ్యారు. రైల్వే ట్రాక్‌పై వేర్వేరు రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడంతో ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది.
గోపి, ప్రియాంక కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన రెండు కుటుంబాలు ఈ సంబంధానికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఈ నెల 5న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువైపుల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినా, ఎవ్వరూ వారి పెళ్లిని అంగీకరించలేదు. దీంతో ఈ జంట తీవ్ర నిరాశకు గురైంది.
రెండు రోజుల క్రితం గోపి ఇంటి నుంచి బయటకు వెళ్లి, పేరేచర్ల సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వార్త తెలిసిన ప్రియాంక తీవ్ర మనోవేదనతో మరుసటి రోజు అదే ప్రదేశంలో ఆత్మహత్య చేసుకుంది. కలిసి జీవించలేమనే మనస్తాపంలో ఇలాంటి ఘోర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇద్దరి మృతదేహాలను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది.



